సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2023 (12:19 IST)

సన్యాసులకు పాదాభివందనం చేయడంలో తప్పు లేదు : రజినీకాంత్

rajini - yogi feet
సన్యాసులు, యోగులకు పాదాభివందనం చేయడంలో ఎలాంటి తప్పు లేదా దోషం లేదని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. ఆయన చేపట్టిన ఉత్తర భారత యాత్రలో భాగంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పాదాభివందనం చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి చెన్నైకు తిరిగి వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, సన్యాసులు, యోగులు మనకంటే వయసులో చిన్నవా రైనప్పటికీ వారికి పాదాభివందనం చేయడం తనకు అలవాటని, తాను అదే చేశానని చెప్పారు. అలాగే, యూపీ సీఎం యోగి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లను కలుసుకోవడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని, కేవలం స్నేహపూర్వకంగానే కలుసుకున్నట్టు చెప్పారు. 
 
ఇకపోతే, తాను నటించిన 'జైలర్' చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ హిట్ చేసిన అభిమానులకు, తనను పెంచి పోషిస్తున్న తమిళ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కళానిధి మారన్, ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలచిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చిత్రంలోని ఇతర నటీనటులు, టెక్నీషియన్లకూ ధన్యవాదాలు తెలిపారు. 
 
నాలుగేళ్ల తర్వాత హిమాలయాలకు వెళ్లి రావడం చాలా సంతోషంగా ఉందని, ప్రయాణం సాఫీగా సాగిందని తెలిపారు. రాజకీయాల గురించి విలేకరులు ప్రశ్నించగా నో కామెంట్స్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.