మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (12:12 IST)

ప్రధానమంత్రి కుర్చీ కోసం రేసులో నిలిస్తే మద్దతిస్తామన్నారు : నితిన్ గడ్కరీ

nitin gadkari
తాను ప్రధానమంత్రి కుర్చీకోసం రేసులో నిలిస్తే మద్దతిస్తామంటూ ఓ ఆఫర్ వచ్చిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తన సొంత నియోజకవర్గం నాగ్‌పూర్‌లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రి రేసులోకి వస్తే మద్దతు ఇస్తామంటూ ఆఫర్ వచ్చిందని చెప్పారు. అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించానని, ప్రధానమంత్రి పదవి తన ఆశయం కాదన్నారు. 
 
'నాకు ఒక సంఘటన గుర్తుంది. నేను ఎవరి పేరు చెప్పను. మీరు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటే మద్దతిస్తాం అని ఆ వ్యక్తి చెప్పారు. అయితే, మీరు నాకు ఎందుకు మద్దతు ఇవ్వాలి. నేను మీ మద్దతు ఎందుకు తీసుకోవాలి అని నేను అడిగాను. ప్రధానమంత్రి కావడమే నా జీవిత ఆశయం కాదు. నేను నా విశ్వాసానికి, నా ఆర్గనైజేషన్‌కు విధేయుడిని. ఆ విషయంలో నేను రాజీపడను. ఎందుకంటే ఏదైనా పదవి కంటే నా విశ్వాసం నాకు చాలా ముఖ్యమైనది' అని గడ్కరీ పేర్కొన్నారు. 
 
అయితే ఆ సంభాషణ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో జరిగిందనే విషయాన్ని గడ్కరీ చెప్పలేదు. రాజకీయాలతో పాటు జర్నలిజంలో కూడా నైతిక విలువలు పాటించాలని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ సూచించారు. కమ్యూనిస్టు నాయకుడు ఏబీ బర్దన్ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకి అయినప్పటికీ ఆయనను గౌరవించాలని గడ్కరీ వ్యాఖ్యానించారు. నాగ్‌పూర్ విదర్భ ప్రాంతానికి చెందిన అతిపెద్ద రాజకీయ నాయకులలో ఆయన ఒకరని, నిజాయితీ గల ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఆయన అన్నారు. 
 
ఓ సీపీఐ నేతకు ఇదే విషయాన్ని చెప్పానని ప్రస్తావించారు. 'నిజాయితీతో వ్యతిరేకించే వ్యక్తిని గౌరవించాలని నేను సీపీఐ వ్యక్తికి చెప్పాను. ఎందుకంటే అతడి వ్యతిరేకత నిజాయితీ ఉంటుంది. నిజాయితీ లేని వ్యక్తికి గౌరవం అక్కర్లేదు' అని గడ్కరీ వ్యాఖ్యానించారు. కామ్రేడ్ బర్ధన్ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని, అయితే ప్రస్తుతం రాజకీయాలతో పాటు జర్నలిజంలో అలాంటి వ్యక్తులు లేరని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక, శాసనసభ, మీడియా అనే నాలుగు స్తంభాలు నిజాయితీగా నడుచుకున్నప్పుడే ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుందని అన్నారు.