శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (20:43 IST)

వాహనం ఆపారనీ పోలీస్ కానిస్టేబుల్‌తో గుంజీలు తీయించిన అధికారి...

కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ ఆంక్షలు ఉల్లంఘిచి రోడ్లపైకి వచ్చే వారి పట్ల పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కొందరు జులాయిలతో గుంజీలు కూడా తీయిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం మీడియాలో ప్రసారమయ్యాయి. కానీ, బీహార్ రాష్ట్రంలో అంతా వ్యతిరేకం. ఓ వ్యక్తి వాహనం ఆపినందుకు పోలీసులే గుంజీలు తీశారు. దండం పెట్టి మమ్మలను వదిలేయండి మహాప్రభో అని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. అలాగే, బీహార్‌లో కూడా ఇది కొనసాగుతోంది. దీంతో బైర్‌గాచి చౌక్ ద‌గ్గ‌ర పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
 
ఈ తనిఖీల్లో భాగంగా, సోమవారం సాయంత్రం అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌ గణేష్‌ తాత్మ ఓ వాహ‌నాన్ని ఆపాడు. దీంతో ఆ వాహ‌నంలో ఉన్న‌ జిల్లా వ్యవసాయ అధికారి మనోజ్‌ కుమార్ తీవ్ర ఆగ్ర‌హానికి లోన‌య్యాడు. 
 
కారులో నుంచి కిందకు దిగి న‌న్నే ఆపుతావా? నీ అంతుచూస్తా, నిన్ను జైల్లో వేయిస్తా అంటూ ఆ పోలీస్ కానిస్టేబుల్‌పై ఒంటికాలిపై లేచాడు. ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో హడలిపోయిన ఆ పోలీస్ కానిస్టేబుల్ దండం పెడుతూ క్షమాపణ కోరారు.
 
అప్పటికీ ఆగ్రహం చల్లారని ఆ వ్యవసాయ అధికారి.. ఖాకీని గుంజీలు తీయాలని ఆదేశించారు. దీంతో మరో మార్గం ఆ కానిస్టేబుల్ గుంజీలు తీశారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. 
 
దీంతో అరారియా జిల్లా ఎస్పీ దుర‌త్ స‌యాలీ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. గణేష్ తాత్మ గుంజీలు తీస్తుంటే మరో కానిస్టేబుల్ పక్కనే నిలబడి మిన్నకుండిపోయాడు.