టెన్త్ పరీక్ష రాసేందుకు వెళ్లిన యువతి భర్తతో ఇంటికి తిరిగొచ్చింది.. ఎక్కడ?
బీహార్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ యువతి... తన ప్రియుడిని పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగివచ్చింది. తన కుమార్తె పెళ్లి చేసుకుని ఇంటికి రావడాన్ని చూసిన తల్లిదండ్రులు అవాక్కయ్యారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, మణిహరి ప్రాంతానికి చెందిన గౌరికి 2016లో మొబైల్ ఫోన్‌కు ఓ మిస్‌కాల్ వచ్చింది. దీంతో ఆమె రిటర్న్ కాల్ చేయగా, నితీశ్ అనే యువకుడు తీసి మాట్లాడాడు. అలా వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది.
నాలుగేళ్ళపాటు ప్రేమించుకున్న వీరి పెండ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి. దీంతో వారే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పోలీసుల సహాయం కోరారు. ఇద్దరు మేజర్లు కావడంతో వీరి ప్రేమ వివాహానికి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
ఈ నేపథ్యంలో శనివారం పరీక్ష రాసేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన గౌరి పరీక్ష కేంద్రానికి వెళ్లింది. అయితే పరీక్ష రాసేందుకు లోనికి వెళ్లకుండా అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న నితీశ్‌తో కలిసి గుడికి వెళ్లింది. గుడిలో వీరిద్దరు పోలీసుల సమక్షంలో పెండ్లి చేసుకున్నారు. పోలీసుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీసులు కూడా పొందారు.
అయితే పరీక్ష రాయలేనందుకు గౌరికి ఏ మాత్రం బాధ లేదు. తాను ప్రేమలో పాస్ అయ్యానని, వచ్చే ఏడాది పరీక్షను రాస్తానని ఆమె చెప్పింది. మరోవైపు వీరి పెళ్లి విషయాన్ని పోలీసులు ఇరు కుటుంబాలకు తెలిపారు. మేజర్లు కావడంతో వారి ఇష్ట ప్రకారం పెండ్లి చేసుకున్నారని నచ్చజెప్పారు. దీంతో గౌరి తాను పెండ్లాడిన ప్రియుడు నితీశ్‌ను తీసుకుని తన ఇంటికి వెళ్లింది.