శనివారం, 15 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 నవంబరు 2025 (10:53 IST)

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు : దర్యాప్తునకు సాయం చేసేందుకు ఆసక్తి చూపిన అమెరికా.. నో చెప్పిన భారత్

redfort blast car
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా భారత్‌కు సహకరించేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకు వచ్చింది. అయితే, అమెరికా ప్రతిపాదనను భారత ప్రభుత్వం తోసిపుచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఈ పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకు వచ్చామని, కానీ ఆ అవసరం భారత్‌కు లేదని తెలిపారు.
 
బుధవారం కెనడాలో జీ7 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. దీని తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుపై దర్యాప్తునకు భారత్‌కు సాయం చేసేందుకు తాము ముందుకొచ్చామని తెలిపారు. అయితే, తమ అవసరం వారికి లేదని వ్యాఖ్యానించారు. 
 
భారత అధికారులు అసాధారణమైన వృత్తి నైపుణ్యంతో దర్యాప్తు చేస్తున్నారు. ఈ జీ7 సమావేశాల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, మార్కో రూబియోతో భేటీ అయ్యారు. ఇరువురి మంత్రులు అనేక ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుడు విషయం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. 
 
సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటనతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. పేలుడుకు కారకులను కనుగొనేందుకు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టారు. ఈ కేసు విచారణకు ఎన్‌ఐఏ 10 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఘటనకు డాక్టర్‌ ఉమర్‌ నబీ కీలక వ్యక్తిగా భావిస్తున్నారు. పేలుడులో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని కారులో స్వాధీనం చేసుకున్నారు.