గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (18:43 IST)

కోవిడ్ వచ్చినా భయం వద్దు: బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా

దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ కోవిడ్ వైరస్ తీవ్రత మాత్రం తగ్గుతుందన్న అభిప్రాయం వైద్య వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వచ్చినా అప్రమత్తంగా ఉంటే ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవచ్చని పలువురు ప్రముఖులు వారి అనుభవాలను తెలియజేస్తున్నారు. 
 
అలాంటి వారిలో ప్రముఖ ఔషధ కంపెనీ బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా ఒకరు. ఇటీవల ఆమె కోవిడ్ బారినపడ్డారు. వైరస్ ఆమెపై ఎలాంటి ప్రభావం చూపింది? వైరస్ సోకిన సమయంలో ఎదురైన అనుభవాలేంటో కిరణ్‌ మజుందార్‌ షా తన సొంత బ్లాగ్ https://kiranshaw.blog/ ద్వారా పంచుకున్నారు. 
 
పాజిటివ్ వచ్చిందని భయాందోళనకు గురికావద్దు:
కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. వైరస్ సోకినప్పటికీ దానిబరిన పడి కోలుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. కోవిడ్ పాజిటివ్‌ వస్తే భయపడకుండా ధైర్యంగా ఉండడం ముఖ్యం. "ఆగస్టు 16వ తేదీ సాయంత్రం  కొంచెం జ్వరంలా అనిపించింది. జూన్‌లోనే కొంత ఇబ్బంది అనిపించినా పరీక్షలు చేయించుకుంటే నెగటివ్‌గా తేలింది.

దాంతో క్రోసిన్‌ వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకున్నా. మరుసటి రోజు ఉదయం వరకు జ్వరం అలాగే ఉంది. దీంతో నేను, నా భర్త (71 ఏళ్లు), మా అమ్మ (89 ఏళ్లు) కోవిడ్‌ పరీక్షలు చేయించుకున్నాం. నా భర్తకు క్యాన్సర్‌ ఉండటంతో చాలా కంగారుపడ్డాం. వెంటనే ఒకొక్కరం స్వీయ నిర్బంధంలోకి వెళ్లాం. 
 
ఫలితం ఏం వస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూశాం. ఆ రోజు సాయంత్రం 5గంటలకు నా రిపోర్టు పాజిటివ్‌ అని తెలిసింది. నా కుటుంబ సభ్యులకు, సిబ్బందికి నెగటివ్‌ వచ్చినట్టు తేలింది."
 
సీటీ (సైకిల్‌ థ్రెషోల్డ్‌) విలువ ఆధారంగా మీ వైరల్ లోడ్‌ ను తెలుసుకోండి
"కోవిడ్ పాజిటివ్ వచ్చినా ఎవరూ భయపడొద్దు. స్వల్ప లక్షణాలు ఉన్న ఎవరైనా వెంటనే పరీక్షలు చేయించుకోండి. సైకిల్‌ థ్రెషోల్డ్‌ (CT) విలువ ఆధారంగా మీలోని వైరల్‌ లోడ్‌పై ఓ అంచనాకు రండి. ఆ తర్వాత వైరల్‌ లోడ్‌ ఆధారంగా ఆస్పత్రికి వెళ్లాలో, ఇంట్లోనే క్వారంటైన్‌ ఉండాలో నిర్ణయించుకోండి. 
 
సీటీ వాల్యూ 20 కన్నా తక్కువ ఉంటే మాత్రం హోం ఐసోలేషన్‌లో ఉండొద్దు. స్వల్ప లక్షణాలు, మధ్యస్థంగా వైరల్‌ లోడ్‌ ఉంటే హోం ఐసోలేషన్‌ సరిపోతుంది. నాలో వైరల్‌ లోడ్‌ తెలుసుకొనేందుకు సీటీ (సైకిల్‌ థ్రెషోల్డ్‌) ద్వారా చూడగా విలువ 23గా చూపించింది. వైరల్‌ లోడ్‌ అంతగా లేకపోవడంతో హోం క్వారంటైన్‌లోనే ఉన్నా" అంటూ ఆమె తన బ్లాగ్‌లో వెల్లడించారు.
 
కోవిడ్ లక్షణాలుంటే పరీక్ష చేయించుకోండి, నిర్లక్ష్యం వద్దు
"కోవిడ్ తో మీ శరీరం వారం పాటు పోరాటం చేస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండకపోతే వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ కణజాల వ్యవస్థ దెబ్బతిని అలసట, శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు తలెత్తొచ్చు. మీలో స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడే దయచేసి కొవిడ్‌ పరీక్షలు చేయించుకోండి. పరీక్ష నిరాకరించొద్దు.  ఎక్కువ లక్షణాలు వచ్చేవరకు వేచి ఉండొద్దు" అని ఆమె హెచ్చరించారు.
 
వీలైనంతసేపు నడక లేదా యోగా చేయండి 
"కోవిడ్ బారినపడిన సమయంలో వ్యాయామం చేయండి. వీలైనంత సేపు నడవంటి. నెమ్మదిగా నడిచినా మంచిదే" అని సూచించారు. 
 
శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు పరీక్షించుకోండి
"కోవిడ్ సోకిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనది ఆక్సిజన్ లెవల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం. ఆక్సిజన్‌ సంతృప్తికర స్థాయిలో ఉందో, లేదో తరచూ చూసుకోవడం మంచిది. రోజుకు పలుమార్లు దాన్ని సరి చూసుకోవడం ద్వారా మానసిక స్థైర్యం ఏర్పడుతుంది.

నా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ 95శాతం తగ్గకుండా ఉండాలి. నాలో ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకొనేందుకు రోజుకు ఆరుసార్లు చూసుకున్నా. ఆరు నిమిషాల పాటు నడక తర్వాత ఆక్సిజన్‌ స్థాయి 96శాతం నుంచి 98శాతం మధ్య ఉండేది"
 
డాక్టర్లతో ఫోన్ సంప్రదింపుల ద్వారా ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోండి
"వైద్యులను ఫోన్‌లో సంప్రదించి  వారి పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి. ఫావిపిరావిర్‌, అజిత్రోమైసిన్‌, పారాసిటమాల్‌ ఔషధాలను కోర్స్‌గా తీసుకున్నా. 

అలాగే, ప్రతి రోజు విటమిన్‌ సి, డి, జింక్‌, బేబీ ఆస్ప్రిన్‌, చ్యవన్‌ప్రాశ్‌‌ వాడాను. వారానికి రెండు సార్లు 200 మి.గ్రా.ల మోతాదుతో హైడ్రోక్లోరోక్విన్‌ మాత్రలు వేసుకున్నా"
 
టీవీ, సామాజిక మాధ్యమాలకు దూరం
"హోం క్వారంటైన్‌లో ఉన్నప్పుడు నా ఒంటరితనాన్ని పోగొట్టేందుకు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ తోడుగా నిలిచాయి. కోవిడ్ పై నెగటివ్‌ ప్రచారం జరుగుతున్న వేళ టీవీ, సామాజిక మాధ్యమాలకు దూరంగానే ఉన్నా’’ అని కిరణ్‌ మజుందార్‌షా తన బ్లాగ్ లో వివరించారు
 
కాబట్టి బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా చెప్పినట్టు కోవిడ్ వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానం కలిగిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. 
 
మన ఆరోగ్య పరిస్థితి, ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నట్టయితే వైద్యుల సూచనలతో ఆస్పత్రికి వెళ్లాలి. లేదంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలి. కోవిడ్ సోకిందన్న భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉంటే వైరస్ పై విజయం సాధించడం సులభం అవుతుంది.