సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (19:02 IST)

కోవిడ్-19 వైరస్ ని ఇలా నివారించవచ్చు..

కోవిడ్-19 వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ వైరస్ కు ప్రస్తుతం వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నాయి. వాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలు తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే వైరస్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకోగలం. 

ఈ పరిస్థితుల్లో అసలు కోవిడ్ వైరస్ అంటే ఏమిటి? వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వ్యాధి వ్యాప్తిని ఎలా అరికట్టవచ్చు, వైరస్ నుంచి మనల్నిమనం ఎలా కాపాడుకోవాలి? అనేది తప్పక తెలుసుకుని ఉండాలి. 
 
ఇక్కడ ఇవ్వబడిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించండి. కోవిడ్ మహమ్మారిని పారద్రోలండి. 
 
కరోనా వైరస్ అంటే ఏమిటి?
కరోనా వైరస్ అనేది వైరస్ ల యొక్క పెద్ద కుటుంబం. భూమి మీద ఉన్న అనేక వైరస్‌ల్లాగే కరోనా వైరస్ జంతువులకు లేదా మనుషులకు హాని కలిగిస్తుంది. ఈ కరోనా వైరస్‌లు సాధారణ జలుబు మొదలుకొని ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిటరీ సిండ్రోమ్ మరియు సివియర్ అక్యూట్ రెస్పిటరీ సిండ్రోమ్ వంటి వ్యాధులను మానవులకు కలిగిస్తాయి. అయితే ఇటీవలే కనిపెట్టిన కొత్త కరోనా వైరస్  కోవిడ్-19 అనే వ్యాధిని కలిగిస్తుంది.
 
కోవిడ్-19 అంటే ఏమిటి?
కోవిడ్-19 అనేది ఇటీవల కనుగొన్న కరోనా వైరస్ ద్వారా వ్యాప్తి చెందేది.  2019 డిసెంబర్ లో చైనాలోని ఊహాన్‌ నగరంలో బయటపడినప్పుడే ఈ వైరస్ గురించి ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను ప్రభావితం చేస్తున్న మహమ్మారిగా మారింది. 
 
కోవిడ్ -19 లక్షణాలు?  
 
• జ్వరము
• పొడిదగ్గు
• జలుబు/ ముక్కు నుంచి కారుట
• గొంతు రాపిడి
• విరేచనాలు
• ఆకలి లేకపోవడం
• న్యుమోనియా
• శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన నొప్పి
 
కోవిడ్-19 వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
• దగ్గు లేదా తుమ్ము ద్వారా గాలి పీల్చుకోవడం.
• సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు.
• వైరస్ సోకిన వ్యక్తి తాకిన వస్తువులను మనం తాకడం తద్వారా మన కళ్ళు, నోరు మరియు ముక్కును మన చేతులతో తాకడం వల్ల వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. 
 
కోవిడ్ -19 మరణానికి దారితీస్తుందా?
• ఈ వైరస్ బారినపడిన వారందరికీ మరణం సంభవించదు.  ఈ వైరస్ సోకిన వారిలో 96శాతం మంది కోలుకుంటారు. 
• వైరస్ సోకిన వారిలో 80శాతం మంది స్వల్పమైన జలుబు, దగ్గు లేదా ఫ్లూని పోలి ఉంటారు. నివారణ చర్యలు పాటించకపోతే ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి వేగంగా సోకుతుంది.
• కోవిడ్-19 గురించి మరింత సమాచారం పొందడానికి టోల్ ఫ్రీ నంబర్ 104 కాల్ చేయవచ్చు లేదా 8297104104 నంబర్ వాట్సాప్ కు హాయ్ అని మెసేజ్ చేసి కానీ తెలుసుకోవచ్చు.
 
కోవిడ్-19 వైరస్ ని ఇలా నివారించవచ్చు?
 
వ్యాధిని నయం చేయడానికి టీకాలు అందుబాటులో లేవు. కాబట్టి కోవిడ్ వైరస్ నివారణలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కీలకం. దిగువ ఇవ్వబడిన నివారణ చర్యలను ప్రయత్నించడం ద్వారా మీరు ఈ వైరస్ బారినపడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు:
• ఏదైనా చర్యకు ముందు మరియు తరువాత తరచూ చేతులు కడుక్కోవడం ద్వారా పరిశుభ్రతను పాటించండి.
• రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కును తప్పనిసరిగా ధరించాలి.
• జంతువులు మరియు ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం పూర్తిగా తగ్గించాలి.  
• వీలైనంత వరకు కళ్ళు మరియు ముక్కును తరచూ తాకకూడదు. 
• దగ్గు లేదా తుమ్ములు వస్తున్నపుడు నోరు మరియు ముక్కు రెండింటికి మోచేతిని అడ్డుపెట్టుకోవడం లేదా టిష్యూ పేపర్ ను  వాడండి.
• తరచూ తాకే డోర్ హ్యాండిల్స్, రైలింగ్, లిప్ట్ లోని స్విచ్ లు వంటి ప్రదేశాలను సాధ్యమైనంత వరకు తాకవద్దు.    
• తినడానికి ముందు మాంసం మరియు గుడ్లను సరిగ్గా ఉడికించాలి.
• మీరు స్వల్పంగా అనారోగ్యంతో బాధపడుతుంటే అప్రమత్తంగా ఉండండి, విశ్రాంతి తీసుకోండి.
 
కోవిడ్ వైరస్ మొదట జ్వరంగా మొదలవుతుంది. న్యుమోనియా మరియు శ్వాసనాళంలో వాపు రావడంతో ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. మీరు ఈ లక్షణాలను ఎదుర్కొంటుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
 
కోవిడ్ వైరస్ కు ఏదైనా చికిత్స ఉందా?
లేదు. ప్రస్తుతం కోవిడ్19కి యాంటీ వైరస్ కు వ్యాక్సిన్ గానీ చికిత్స గానీ లేదు. అందువల్ల మీరు తినే ఆహారం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండకూడదు మరియు బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం వచ్చిన వ్యక్తులు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లక్షణాల నుండి ఉపశమనం పొందటానికి మరియు ముఖ్యమైన చికిత్సకు సంబంధించి వైద్యుల నుంచి తగిన సహాయం పొందాలి.  
 
కోవిడ్ వైరస్ వ్యాధికి కోలుకునే సమయం ఎంత? 
అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ఆధారంగా.. తేలికపాటి కేసుల నుండి క్లినికల్ రికవరీ వరకు సగటు సమయం సుమారు 2 వారాలు మరియు తీవ్రమైన లేదా క్లిష్టమైన వ్యాధి లక్షణాలున్న ఉన్న రోగులకు 3-6 వారాలు పడుతుంది.