1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (15:39 IST)

అంతరిక్షంలోకి వెళ్లనున్న ఆ నలుగురు భారతీయ వ్యోమగాములు వీరే...

indian austronuts
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వచ్చే యేడాది అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించనుంది. ఇందుకోసం ఏర్పాట్లుచేస్తుంది. అయితే, అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లను మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. తిరువనంతపురం పర్యటనలో ప్రధాని మోడీ 2025లో గగన్ యాన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాములతో ముచ్చటించారు. ఆ తర్వాత ఆ నలుగురి పేర్లను ప్రకటించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన గ్రూపు కెప్టెన్లు అజిత్ కృష్ణన్, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగడ్ ప్రతాప్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లాలు గగన్ యాన్ స్పేస్ ఎక్స్ ద్వారా రోదసీలోకి వెళ్ళి తిరిగిరానున్నారు. 
 
ఈ నలుగురు పేర్లను వెల్లడించిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ... ఇవి నాలుగు పేర్లు కాదన్నారు. 140 కోట్ల మంది భారతీయ ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు అని అభివర్ణించారు. ఆ తర్వాత ఈ నలుగురు వ్యోమగాములను ప్రధాని మోడీ పరిచయం చేశారు. 40 యేళ్ళ క్రితం రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టగా, మళ్లీ ఇన్నాళ్లకు భారతీయులు అంతరిక్షంలోకి వెళుతున్నారు. అయితే, ఈ వ్యోమగాములు ప్రయాణించే వ్యోమ నౌకతో పాటు కౌంట్ డౌన్ కూడా మనదే కావడం గమనార్హం. అయితే, ఈ నలుగురు వ్యోమగాములకు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్ కాస్మోస్ శిక్షణ ఇచ్చింది.