శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 2 మే 2024 (14:14 IST)

Heat waves in India, ఎండ తీవ్రంగా వుందండి, ఏం చేయాలి? వడదెబ్బకు విరుగుడు

summer
ఎడారి ప్రాంతాలను కలిగి వున్న సౌదీ అరేబియా కంటే భారతదేశంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి. 1961 నుండి 2021 మధ్య, గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారతదేశంలో వేడి తరంగాలు పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం 2024 ఏప్రిల్ నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగర విస్తరణల కోసం దేశంలో భారీగా వృక్షాలను నరికివేస్తున్నారు. అడవులు అంతరిస్తున్నాయి. ఫలితంగా దేశంలో ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కొన్నిచోట్లు 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనుక ఉదయం 10 దాటిన దగ్గర్నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మరీ ముఖ్యమైన పనులు వుంటేనే బయటకు రావాలి. స్థానిక వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండండి.

ఎండ తీవ్రంగా వుందండి, ఏం చేయాలి?
నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రుమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. దాహం వేయకపోయినా తరుచుగా నీటిని తాగండి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓఆర్‌యస్ కలిపిన నీటిని తాగవచ్చును. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానట్లయితే, దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు గాని, నిమ్మరసము గాని, కొబ్బరినీరు గాని తాగాలి.
 
తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తల తిరగడం, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలోని వైద్యుణ్ణి సంప్రదించండి. ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోండి. చల్లని నీరుతో స్నానం చేయండి. తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటిపై కప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్‌ను ఉపయోగించండి. మేడపైన మొక్కలు, ఇంట్లోని మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్)  భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిధంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి.
 
ఎండ తీవ్రతంగా ఉన్నప్పుడు చేయకూడనివి:
ఎండలో గొడుగు లేకుండా తిరగరాదు. వేసవి కాలంలో నలుపురంగు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు. మధ్యాహ్నం తరువాత (మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల మధ్యకాలంలో) బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయరాదు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్దులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు. వీరిపై ఎండ ప్రభావం త్వరగా చూపే అవకాశం ఉంది.
 
శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు మానుకోండి. అధిక ప్రోటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే  పదార్దాలను తీసుకోవద్దు. మరింతగా ప్రకాశించే లైట్ బల్బులను వాడటం మానుకోండి, అవి అనవసరమైన వేడిని విడుదల చేస్తాయి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపిపదార్ధములు తీసుకోరాదు. శీతల పానీయాలు, ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యము ఏర్పడుతుంది.
 
ఎండ ఎక్కువగా వున్న సమయంలో వంట చేయకుండా ఉండండి. వంట గది తలుపులు, కిటికీలను తీసివుంచి తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోండి. వడదెబ్బకు గురైన వారిని వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడువరాదు. దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏమాత్రం ఆలస్యం చేయరాదు.