అంతా మా డాడీ వల్లే : కాంగ్రెస్‌తో కలిసినందుకు కన్నీరే మిగిలింది : కుమారస్వామి
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి తప్పు చేశామని జేడీఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామి తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి ప్రధాన కారణం తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ అని చెప్పారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 2018లో కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలల్లోనే తాను కన్నీరుపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఏం జరుగుతుందో తనకు ముందే తెలుసునని చెప్పారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు, కాంగ్రెస్ 79, జేడీఎస్ 37 సీట్లు సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.
అయితే, అయితే అత్యధిక సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌కు 8 సీట్ల దూరంలో నిలిచింది. కాగా, బీజేపీని అధికారానికి దూరంచేయడానికి కాంగ్రెస్, జేడీఎస్ చేతులు కలిపాయి.
జేడీఎస్‌కు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఆపార్టీ నేత కుమార స్వామిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది. ఆ ప్రభుత్వం ఏడాది కాలంలోనే కూలిపోయింది. ఈనేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌తో అనవసరంగా చేతులు కలిపానని వాపోయారు. బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగించి ఉంటే తాను ఇప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండేవాడినని కుమారస్వామి అన్నారు.
2006 నుంచి 2017 వరకు తాను సంపాదించుకున్న మంచిపేరును కాంగ్రెస్‌తో పొత్తువల్ల కోల్పోయానని చెప్పారు. 2018లో కాంగ్రెస్ చేసినట్లు, 2008లో బీజేపీ తనను బాధించలేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు నడిచినందుకు తాను సర్వస్వం కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశారు.