గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 మే 2023 (11:39 IST)

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత నాదే... : బసవరాజ్ బొమ్మై

basavaraj bommai
కర్నాటక రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఓడిపోవడానికి నైతిక బాధ్యతను వహిస్తున్నట్టు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు. అలాగే, తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
శనివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఆయన నేరుగా హుబ్బళ్లి నుంచి బెంగళూరు ‌రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌కు తన రాజీనామా లేఖ అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఆయనకు సూచించారు. 
 
అంతకుముందు ఆయన బొమ్మై మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఓటమికి తానే నైతిక బాధ్యత తీసుకుంటానని అన్నారు. రాబోయే రోజుల్లో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. 'బీజేపీ ఓటమికి నాదే బాధ్యత. మేం ఓడటానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విశ్లేషించుకుంటాం. ఎన్నికల్లో కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో వ్యవస్థీకృతంగా వ్యవహరించింది. వాటిని చేధించడంలో మేం విఫలమయ్యాం. తప్పులు, లోపాలు సరిదిద్దుకొని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తాం' అని వ్యాఖ్యానించారు. 
 
అదేసమయంలో వరుసగా నాలుగోసారి తనను గెలిపించినందుకు శిగ్గావ్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలి పారు. ప్రజా తీర్పును గౌరవంగా అంగీకరిస్తున్నామని మరో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఏమాత్రం ప్రభావం చూపబోవన్నారు.