కర్నాటకలో కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేయలేకపోయిన సర్వే సంస్థలు
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఒక్క సంస్థ మినహా, ఇతర ఏ ఒక్క సర్వే సంస్థ అంచనా వేయలేకపోయింది. ఇండియా టుడే- యాక్సిస్ సర్వే సంస్థ మాత్రమే పక్కాగా తేల్చి చెప్పింది. మిగిలిన సంస్థలు ఏమాత్రం అంచనా వేయలేకపోయాయి. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి విజయపతాకాన్ని ఎగురవేసింది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకటిన్నర డజన్ల దాకా దిగ్గజ సర్వే సంస్థలు బుధవారం ఎన్నికలు జరగ్గానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. ఒకట్రెండు సంస్థలు బీజేపీకి పట్టమని చెప్పగా.. మిగతావాటిల్లో కొన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు వస్తాయని వెల్లడించాయి.
మరికొన్ని సంస్థలు అత్యధిక స్థానాలతో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ చేరువలో ఉంటుందని, హంగ్ తథ్యమని చెప్పాయి. ఒక్క ఇండియాటుడే - యాక్సిస్ మై ఇండియా మాత్రమే కాంగ్రెస్ పార్టీకి 122-140 స్థానాలు వస్తాయని, బీజేపీ 62-80కి, జేడీఎస్ 20-25కు పరిమితమవుతాయని పేర్కొనడం గమనార్హం. ఈ సర్వే ఫలితాలు పక్కాగా అమలయ్యాయి.
కర్ణాటకలోని ఆరు ప్రధాన రీజియన్ల వారీగా ఆ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒకట్రెండు చోట్ల కాస్త అటూ ఇటుగా ఉన్నా.. అవే నిజమయ్యాయి. కోస్టల్ కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ(16) వస్తాయని చెప్పగా.. ఇంచుమించుగా నిజమైంది. కాంగ్రెస్ పార్టీకి మధ్య కర్ణాటకలో 12, కల్యాణ్(ముంబై) కర్ణాటకలో 28, బెంగళూరు రీజియన్లో 17, పాత మైసూరులో 36, హైదరాబాద్-కర్ణాటకలో 32 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
కాంగ్రెస్ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ మార్కును చేరుకుంటుందని ఇండియాటుడే- యాక్సిస్ మై ఇండియాతోపాటు.. ఆత్మ సాక్షి(117-124), ఇండి యాటీవీ-సీఎన్ఎక్స్(110-120), జీన్యూస్-మాట్రైజ్ (103-118), న్యూస్ 24-టు డేస్ చాణక్య(120), టైమ్స్ నౌ-ఈటీజీ(113) ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.