శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 మే 2020 (13:17 IST)

మిడతలు మనిషి జోలికి రావట.. ఆకుల్ని మాత్రం వదలవట..

మిడతలతో భారత్‌కు ఇబ్బంది తప్పదు. మిడతల సైకిల్‌ కొనసాగే ప్రాంతాలు ఇరాన్, పాకిస్థాన్, భారత్, ఆఫ్ఘానిస్థాన్‌ దేశాలు. భారత భూభాగంలో మిడతల సీజన్‌ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలు. ఇరాన్, పాకిస్థాన్‌ మీదుగా భారత్‌కు వచ్చి, ఆఫ్ఘాన్‌వైపు తరలిపోయే మిడతలు ఈసారి భారత్‌లోకి ఏప్రిల్, మే నెలల్లోనే వచ్చాయి. 
 
అందుకు వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతంలో చెలరేగిన తుపానులు, పశ్చిమ గాలుల ప్రభావంతో ఈసారి మిడతలు ముందుగానే భారత్‌లోకి దండయాత్రకు వచ్చాయి. వాటిని నాశనం చేసేందుకు క్రిమిసంహారక మందులను స్ప్రే చేస్తారు.
 
మిడతలను పటిష్టంగా ఎదుర్కోవాలంటే ఈ నాలుగు దేశాల మధ్య సమన్వయం, సహకారం చాలా అవసరమని అధికారులు చెప్తున్నారు. ఈసారి పాకిస్థాన్‌ సహకారం సరిగ్గా లేక పోవడం వల్లనే నేడు భారత్‌పై పెద్ద సంఖ్యలో మిడతలు దాడికి వచ్చాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. 
 
ఆడ, మగ మిడతలు కలుసుకున్న రెండు రోజులకే ఆడ మిడతలు 60 నుంచి 80 గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టడానికి మిడతలకు బలమైన నేల కూడా కావాలి. పది నుంచి 15 రోజుల్లోగా ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చి ఎగిరేందుకు సిద్ధం కూడా అవుతాయి. ఈ 90 రోజుల సర్కిల్‌లో మిడతలు తెగతింటాయి. 
 
అందువల్ల పంట పొలాలన్నీ సర్వనాశనం అవుతాయి. పచ్చని పొలాలు అందుబాటులో లేనప్పుడు మిడతలు పెద్ద చెట్లపై వాలి వాటి ఆకులను కూడా తింటాయి. అవి మనుషులు, జంతువుల జోలికి మాత్రం రావు.