గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (07:56 IST)

కర్నాటక సెక్స్ సీడీ కేసు : నేడు కోర్టు ముందుకు బాధితురాలు

కర్నాటక రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన సెక్స్ సీడీ కేసులో బాధిత యువతి సోమవారం కోర్టు ముందుకురానుంది. ఈ సీడీ వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తనకు మంత్రి రమేష్ జార్కిహోళి నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆమె ముఖ్యమంత్రి యడ్యూరప్పకు లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో బాధిత యువతి నేడు అజ్ఞాత వీడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళితో బాధిత యువతి ఏకాంతంగా ఉన్న వీడియో ఒకటి ఈ నెల 2న వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ సీడీలో కనిపించిన యువతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె కోసం పోలీసులు వెతికినప్పటికీ ఆచూకీ గుర్తించలేకపోయారు. 
 
అజ్ఞాతంలో నుంచే ఆమె ఇప్పటి వరకు 5 వీడియోలు విడుదల చేశారు. కాగా, ఆమె సోమవారం కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదివారం ఉదయం తన న్యాయవాది జగదీశ్, సహోద్యోగి మంజునాథ్‌తో సోషల్ మీడియా ద్వారా జరిపిన సంప్రదింపులు ఇందుకు ఊతమిస్తున్నాయి. 
 
ఆమె కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందని న్యాయవాది జగదీశ్ కూడా చెప్పారు. అదే జరిగితే కోర్టులోనే ఆమెను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, యువతి తల్లిదండ్రులకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. కాగా, సీడీ వెలుగు చూసిన తర్వాత రమేష్ తన మంత్రిపదవిని కోల్పోయిన విషయం తెల్సిందే.