ప్రధానిగారూ... మీరు జోక్యం చేసుకోండి.. కర్నాటక ఆంక్షలు తగదు : సీఎం విజయ్
కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలతో పాటు.. ప్రయాణికులపై పొరుగు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా, కర్నాటక ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.
కేరళ నుంచి వచ్చే వాహనాలపై నిషేధం విధించింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం లేక విద్యార్థులు, రోగులు, నిత్యావసరాలతో వెళ్లే ట్రక్కు డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు.
దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కర్ణాటక ఆంక్షలతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ముఖ్యంగా విద్యార్థులు, నిత్యావసరాల సరఫరాదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అందులో ప్రస్తావించారు.
ఈ విషయంలో కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించడం కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్నారు. పినరయి లేఖపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి కె సుధాకరన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
కేరళ సీఎం పేర్కొన్నట్టుగా ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలను నిషేధించలేదని తెలిపారు. కేరళ నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారికి 72 గంటల క్రితం చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్షకు సంబంధించి నెగటివ్ రిపోర్టును తప్పనిసరి చేశామన్నారు. అయితే, ఈ నిబంధన కాస్తంత ఇబ్బంది కలిగిస్తుందని గుర్తు చేశారు.
మరోవైపు, అటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేరళ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాల్లో ప్రయాణించే వారికి ధర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను తప్పనిసరిచేసింది. విమానాల్లో వచ్చే ప్రయాణికుల వివారాలను సేకరించి, వారిపై నిఘాపెట్టనుంది.