1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (09:10 IST)

ప్రణబ్ సలహాలు లేని కాంగ్రెస్ పార్టీని ఊహించుకోలేం : సోనియా గాంధీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంపై కాంగ్రెస్ పార్టీ మధ్యంతర అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, తన సంతాపాన్ని తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ 50 యేళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహించారు. ఆయన అనుభవం, మేధాశక్తి, సలహాలు లేని కాంగ్రెస్ పార్టీని ఊహించుకోవడం కష్టం. వ్యక్తిగతంగా కూడా ప్రణబ్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్టు సోనియా గాంధీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
 
కాగా, 84 యేళ్ల ప్రణబ్ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు.. కరోనా వైరస్‌ కూడా సోకడంతో ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కార్డియాక్‌ అరెస్టుతో తుది శ్వాస విడిచారు. 
 
మెదడు రక్తనాళాల్లో గడ్డ (క్లాట్‌) ఉండడంతో శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆగస్టు 10న ఆస్పత్రికి వెళ్లిన ప్రణబ్‌కు పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో ఆయనే స్వయంగా తెలియజేశారు. అదేరోజు ఆయనకు ఆర్మీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. సర్జరీ విజయవంతమైందని కూడా వైద్యులు ప్రకటించారు. 
 
కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం కొనసాగించారు. కరోనా కారణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. తర్వాత ఆయన మూత్రపిండాల పనితీరు మందగించింది. క్రమంగా రక్తం విషపూరితమై (సెప్సిస్‌), ఆదివారంనాడు సెప్టిక్‌ షాక్‌తో బాధపడ్డారని.. సోమవారం (ఆగస్టు 31న) కార్డియాక్‌ అరెస్టుతో మరణించారని వైద్యులు తెలిపారు.