శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (10:40 IST)

నిత్యానంద ఆరోగ్య పరిస్థితి విషమం - వైద్యం కోసం లంకకు విజ్ఞప్తి

Nityananda
ప్రముఖ వివాదాస్పద మతగురువు నిత్యానంద స్వామి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. తక్షణం అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా శ్రీలంక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడికి నిత్యానంద శిష్యులు లేఖ రాశారు. పైగా, వైద్యం కోసం అయ్యే ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని, శ్రీలంకలో పెట్టుబడులు సైతం పెడుతామని హామీ ఇచ్చారు. ఈ లేఖ ఆగస్టు 7వ తేదీన శ్రీలంక అధ్యక్షుడికి రాశారు. 
 
వివిధ నేరారోపణ కేసుల్లో చిక్కున్న నిత్యానంద స్వామి అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయిన విషయం తెల్సిందే. ఆయన శ్రీ కైలాసం అనే దీవిని కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నారు. ఇది శివుడి స్థావరంగా భావించి, ఆ దీవిని కైలాస ద్వీపం అనే దేశంగా ప్రకటించారు. 
 
ఈ పరిస్థితుల్లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో తన దీవిలో సరైన వైద్య సదుపాయాలు లేనికారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తనకు అత్యవసంగా చికిత్స తీసుకోవాల్సిన స్థితిలో ఉన్నట్టు వివరించారు. ఈ లేఖను నిత్యానంద తరఫున శ్రీకైలాస విదేశాంగ మంత్రి నిత్యప్రేమాత్మ ఆనంద స్వామి రాశారు. 
 
స్థానికంగా ఉన్న వైద్య సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకున్నా ఫలితం లేదని, అనారోగ్యానికి కారణమేంటన్నది వైద్యులు తెలుసుకోలేకపోతున్నారని వివరించారు. రాజకీయ ఆశ్రయాన్ని వెంటనే మంజూరు చేయాలని, దాంతో ఎయిర్ అంబులెన్స్‌లో వెంటనే తరలిస్తామని చెప్పారు. 
 
అనంతరం శ్రీలంకలో సురక్షిత ప్రదేశంలో వైద్య చికిత్స తీసుకుంటారని పేర్కొన్నారు. ఇందుకు అయ్యే వ్యయాలను తాము భరిస్తామని చెప్పారు. ఎంత ఖరీదైనా సరే వైద్య ఉపకరణాలను తాము కొనుగోలు చేసుకుంటామని, చికిత్స తర్వాత వాటిని శ్రీలంక కోసం విడిచి వెళతామని తెలిపారు. 
 
రద్దు చేయలేని రాజకీయ ఆశ్రయం మంజూరు చేస్తే శ్రీలంకలో స్వామి పెట్టుబడులు కూడా పెడతారని హామీ ఇచ్చారు. నిత్యానంద అత్యాచార కేసును ఎదుర్కొంటున్నారు. 2010లో అరెస్ట్ అయి విడుదలైన తర్వాత విదేశానికి మకాం మార్చారు.