పెళ్లి పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు
మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్న వేళ.. మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన వారే వారి పాలిట శాపంగా మారారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకుపై పోలీసులు అత్యాచారం కేసు నమోదుచేశారు.
ఎమ్మెల్యే కొడుకు పెండ్లి పేరుతో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని రాష్ట్రానికి చెందిన మహిళా యూత్ కాంగ్రెస్ నాయకురాలు ఆరోపించడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సదరు మహిళ తన కుమారుడిపై తప్పుడు కేసు పెట్టిందని ఎమ్మెల్యే ఆరోపించారు.
గత కొంతకాలంగా సదరు మహిళ తన కొడుకును డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుందని, డబ్బులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు అత్యాచారం కేసు పెట్టిందని ఎమ్మెల్యే చెప్తున్నారు.
తన కుమారుడు ఈ విషయాన్ని ముందే తనకు చెప్పాడని, ఈ మేరకు ఏప్రిల్ 1న ఇండోర్ డీఐజీకి కూడా ఫిర్యాదు చేశాడని చెప్పారు. ఇండోర్ డీఐజీని వివరణ కోరగా.. ఇరుపక్షాల ఫిర్యాదులపై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.