ఎన్సీపీ ఎమ్మెల్యేలకు శరద్ పవార్ హెచ్చరిక... మాకు 170 మంది సభ్యుల బలం

saradh pawar
ఠాగూర్| Last Updated: శనివారం, 23 నవంబరు 2019 (15:06 IST)
పార్టీలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ హెచ్చరిక చేసారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉందన్న విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. రాజకీయ పరిణామాలపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి ఆయన ముంబైలోని వైబీ చవాన్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు.

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించాయన్నారు. తమ మూడు పార్టీలకు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ ఉందని, కొందరు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మొత్తం 170 మంది ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్నారని చెప్పారు.

తమ పార్టీకి వ్యతిరేకంగా అజిత్ పవార్ వ్యవహరించారని, ఆయన హద్దులు మీరారని శరద్ పవార్ ఆగ్రహించారు. ఎన్సీపీ నుంచి ఒక్క నేత కూడా బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా లేరన్నారు.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉందని, ఎమ్మెల్యేలందరూ గుర్తుంచుకోవాలని, శాసనసభ్య సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు. నిజమైన ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ బీజేపీతో చేతులు కలపబోరని వ్యాఖ్యానించారు.

తమ పార్టీకి ఎన్సీపీ నుంచి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఇందుకు సంబంధించిన లేఖను ఆ పార్టీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఇచ్చారని బీజేపీ నేతల వ్యాఖ్యలపై శరద్ పవార్ ఘాటుగానే స్పందించారు.

'అన్ని పార్టీల వద్ద తమ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన పత్రాలు ఉంటాయి. ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ ఉన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన పత్రాలు సాధారణంగా ఆయన వద్దే ఉంటాయి. వాటినే తీసుకెళ్లి ఆయన ఇచ్చి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. అజిత్ పవార్ వెంట 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారు. ఈ విషయంపై మేము త్వరలోనే గవర్నర్‌ను కలుస్తాం' అని పవార్ చెప్పుకొచ్చారు.

'బల నిరూపణకు గవర్నర్ వారికి అవకాశం ఇచ్చారు. అయితే, బీజేపీ మెజార్టీ నిరూపించుకోలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. బల నిరూపణ తర్వాత మా మూడు పార్టీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి' అని ఆయన జోస్యం చెప్పారు. అజిత్ పవార్‌పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్యాప్తు సంస్థలకు భయపడే ఆయన ఈ పనికి పాల్పడ్డారా? అన్న అనుమానం కలుగుతోందని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు.దీనిపై మరింత చదవండి :