సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (15:30 IST)

బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రత్యేకతలేంటి?

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో భారత రక్షణ శాఖకు చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ విమానంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ భార్య మధులిక రావత్‌తో సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 14 మంది ఈ హెలికాఫ్టర్‌లో కున్నూరు నుంచి వెల్లింగ్టన్ ఆర్మీ ట్రైనింగ్ క్యాంపుకు బయలుదేరి కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది.
 
ప్రమాదానికి గురైన విమానం రష్యాకు చెందిన ఎంఐ17వి-5 రకం విమానం. రష్యా నుంచి మొత్తం 80 హెలికాఫ్టర్లను కొనుగోలు చేసేందుకు భారత్ గత 2008 డిసెంబరు నెలలో 1.3 బిలియన్ డాలర్లతో ఒక ఒప్పందు కుదుర్చుకుంది. ఈ హెలికాఫ్టర్లను రష్యా గత 2011 నుంచి భారత్‌కు డెలివరీ చేయడం ప్రారంభించింది. ఇప్పటివరకు మొత్తం 36 హెలికాఫ్టర్లు వచ్చాయి. ఆఖరి బ్యాచ్ హెలికాఫ్టర్లను గత 2018 జూలై నెలలో డెలివరీ చేసింది. 
 
కాగా, ఎంఐ-17వి-5 హెలికాఫ్టర్‌ల రిపేర్ అండ్ సర్వీసింగ్ సౌకర్యాన్ని భారత వాయుసేన 2019 ఏప్రిల్ నుంచి ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక రవాణా హెలికాఫ్టర్ కావడం గమనార్హం. వీటిని భద్రతా బలగాల రవాణాకు, అగ్నిప్రమాదాల కట్టడితో పాటు కాన్వాయ్ ఎస్కార్ట్‌గా, పెట్రోలింగ్ విధుల్లో గాలింపు, రక్షణ ఆపరేషన్‌లో అధికంగా వినియోగిస్తుంటారు. అందుకే త్రివిధ దళాధిపతి కుటుంబ సభ్యులను కూడా ఈ హెలికాఫ్టరులో కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌కు తరలించారు.