అర్నబ్ డబ్బులివ్వకపోవడంతో నా భర్త, అత్తమ్మలు ఆత్మహత్య: ఇంటీరియర్ డిజైనర్ భార్య వెల్లడి
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి అప్పడే బకాయిలు చెల్లిస్తే ఈ రోజు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్ నాయిక్ (53) భార్య అక్షత వ్యాఖ్యానించారు. అర్నబ్ గోస్వామిని అలీబాగ్ పోలీసులు అరెస్టు చేయడంతో తన భర్త, అత్తకు న్యాయం జరిగే దిశగా అడుగులు పడ్డాయన్నారు.
అక్షతతోపాటు ఆమె కూతురు ఆద్న్యా నాయిక్ సైతం విలేకరులతో మాట్లాడారు. టీవీ స్టూడియో పనులు చేయించుకున్న అర్నబ్ పూర్తి డబ్బులు చెల్లించలేదని అక్షత ఆరోపించారు. దీంతోనే అప్పుల్లో కూరుకుపోయిన ఆయన కొత్త పనులు చేయలేకపోయారని తెలిపారు. అందుకే తీవ్ర ఒత్తిడికి గురైన తన భర్త అన్వయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దీంతో ఆయన తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని విలపించారు.
ఈ విషయానికి సంబంధించి అన్వయ్ సుసైడ్ నోట్ కూడా రాశారని గుర్తు చేశారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయలేదన్నారు. దీనికి సంబంధించి చాలాసార్లు ముఖ్యంగా అర్నబ్ బెదిరించాడని ఆరోపించారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అర్నబ్ గోస్వామిని అరెస్టు చేయడంతో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుందని ఆమె అన్నారు.
అసలు ఏం జరిగింది?
ముంబైలో రిపబ్లిక్ టీవీ స్టూడియోకు సంబంధించిన ఇంటీరియర్ పనులు అలీబాగ్‌కు చెందిన డిజైనర్ అన్వయ్ నాయిక్(53) చేశాడు. అయితే కొద్దిరోజుల తర్వాత అలీబాగ్‌లోని తన ఇంట్లో 2018 మే 5వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతోపాటు అన్వయ్ తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే రిపబ్లిక్ చానెల్‌లో పనులు చేసిన అనంతరం అర్నబ్ డబ్బులు ఇవ్వలేదని సుమారు రూ. 83 లక్షలు బకాయిలు రావాల్సి ఉందని.. కానీ, ఆ డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు వారి కుటుంబీకులు ఆరోపించారు. కాగా, అన్వయ్ నాయిక్ సుసైడ్ నోట్‌లో కూడా అర్నబ్ గోస్వామి పేరుతోపాటు మరో ఇద్దరి పేర్లు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేçసినప్పటికీ అనంతరం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ విషయంపై మళ్లీ అన్వయ్ నాయిక్ భార్య, కుమార్తెల ఫిర్యాదు మేరకు ఈ కేసుకు సంబంధించి అర్నబ్ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.