శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (10:36 IST)

నేడు నీట్ పరీక్ష : గంట ముందే కేంద్రానికి రావాలి... ఎన్95 మాస్క్‌లో ధరించాలి

జాతీయ స్థాయిలో వైద్య కాలేజీల్లోని సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్ పరీక్షలు ఆదివారం జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. గత యేడాది 15.97 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం నమోదు చేసుకోగా 13 లక్షల మంది పరీక్ష రాశారు. 
 
ఈ దఫా దేశవ్యాప్తంగా 202 నగరాల్లో మొత్తం 3,842 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్‌, పెన్‌ మోడ్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుందని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కఠిన నిబంధనలు విధించింది.
 
ఇకపోతే, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి 50 వేల మంది దాకా పరీక్ష రాయనున్నారు. తెలంగాణలో గ్రేటర్‌ హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మొత్తం 112 కేంద్రాల్లో నీట్‌ జరగనుంది. అలాగే ఏపీలోని 9 నగరాల్లో 151 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు వచ్చే విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో ఇచ్చే ఎన్95 మాస్కులనే ధరించి పరీక్ష రాయాల్సివుంటుందన్న నిబంధనను కొత్తగా విధించారు. 

కాగా ఈసారి నీట్‌లో స్వల్ప మార్పులు చేపట్టారు. ఇద్దరికీ ఒకే మార్కులు వేస్త, నెగెటివ్‌ మార్కులు తక్కువగా వచ్చిన వారికి ముందు ర్యాంకు ఇవ్వనున్నారు.

ఇక చైన్‌, చెవి రింగులు సహా ఆభరణాలేవీ వేసుకోవద్దని, ఫుల్‌ హ్యాండ్‌ షర్టులు వేసుకోవద్దని  ఎన్‌టీఏ సూచించింది. పెన్నులు, పేపర్లు, వాచీలు, ఫోన్లు, హ్యాండ్‌ బ్యాగ్‌, పౌచ్‌, పర్సు, బెల్ట్‌, నీటి సీసా, స్నాక్స్‌ సహా దేన్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని పేర్కొంది.

హాల్‌ టికెట్‌, ఐడీ కార్డ్‌ మాత్రమే వెంట తీసుకురావాలని సూచించింది. కాగా శనివారం దేశవ్యాప్తంగా 270 నగరాల్లో 679 పరీక్షా కేంద్రాల్లో నీట్‌ పీజీ పరీక్ష జరిగింది. మొత్తం 1.6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనలు అమలుచేస్తూ నిర్వాహకులు పరీక్ష నిర్వహించారు.