శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (09:19 IST)

ట్రయల్ పూర్తి.. ఉరితీతకు సర్వంసిద్ధం... నిర్భయ దోషుల కొత్త ఎత్తుగడలు

నిర్భయ దోషులను శుక్రవారం ఉదయం ఉరితీయనున్నారు. ఢిల్లీ పాటియాలా కోర్టు జారీచేసిన డెత్ వారెంట్ల మేరకు ఈ నలుగురు నిందితులకు ఉరిశిక్షలను తీహార్ జైలు అధికారులు అమలు చేయనున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే తీహార్ జైలు అధికారులు ఉరి ట్రయల్స్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. అంతేకాకుండా, ఉరిశిక్షలను అమలు చేసేందుకు తలారి పవన్ జల్లాద్ కూడా ఇప్పటికే తీహార్ జైలుకు చేరుకుని ఈ ఉరి ట్రయల్స్ నిర్వహించారు. అలాగే, ఉరితీత కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఉరి నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు తమ ఎత్తుగడల్ని వీడటంలేదు. నిర్భయపై లైంగిక దాడి జరిగిన డిసెంబర్‌ 16, 2012న తాను ఢిల్లీలో లేనంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్‌ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చూస్తూ దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ కుమార్‌ వేసిన పిటిషన్‌ను బుధవారం ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో తన అడ్వకేట్‌ను మార్చాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఇంకోవైపు, తమ ఉరితీతను నిలిపివేయాలని దోషులు అక్షయ్‌ కుమార్‌ సింగ్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా ఢిల్లీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తమలో ఇద్దరం రెండోసారి క్షమాభిక్షకు పిటిషన్‌ పెట్టుకున్నామని, అవి రాష్ట్రపతి ముందు ఇంకా పెండింగులోనే ఉన్నాయని కోర్టుకు తెలిపారు. దోషుల వాదనలు విన్న అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రాణా తీహార్‌ జైలు అధికారులకు, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. 
 
ఈ పిటిషన్‌పై గురువారం వాదనలు వింటామని చెప్పారు. ఉరితీతకు ఒక్కరోజు మాత్రమే ఉండగా ఈ పిటిషన్‌ను ఎందుకు వేశారని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్‌ను జడ్జి ప్రశ్నించారు. దీనికి ఆయన జవాబిస్తూ.. ఇతర కోర్టుల్లో కేసులు పెండింగులు ఉండటంతో పని ఎక్కువగా ఉందని చెప్పారు. 
 
కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎదుట ఇద్దరు దోషులు రెండోసారి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లు పెండింగులో ఉండటం, దోషుల్లో ఒకడైన అక్షయ్‌ భార్య వేసిన విడాకుల పిటిషన్‌ పెండింగులో ఉండటం, ఒక కేసులో శిక్ష పడిన దోషులందర్నీ ఒకేసారి ఉరి తీయాలన్న నిబంధన నేపథ్యంలో.. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఉరిశిక్ష.. ఈసారైనా అమలవుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.