ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (13:19 IST)

నిర్భయ దోషులకు ఉరి : వెన్నపూస పూసిన ఉరితాడు సిద్ధం

నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేసేందుకు జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. నిర్భయ వర్థంతి రోజైన డిసెంబరు 16వ తేదీన ఈ శిక్షలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. 2012 డిసెంబర్ నాటి నిర్భయ హత్యాచారం కేసులో ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లు దోషులుగా మారిన విషయం తెల్సిందే. వీరికి మరణదండనను అమలు చేసేందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
వారిని ఉరి తీసేందుకు మీరట్ జైల్లో ఉన్న తలారిని రప్పించిన అధికారులు, జైలులోని ఫాన్సీ కోట బ్యారక్‌లో 1950లో ఏర్పాటు చేసిన ఉరి కొయ్యలను పరిశీలించారు. ఉరికొయ్యగా ఉన్న మెటల్ బార్, నలుగురు దోషుల బరువును మోస్తుందా? అని పరిశీలించారు. 
 
మరో మెటల్ క్రాస్ బార్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. నలుగురికీ ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయాలని భావిస్తున్న జైలు అధికారులు, బీహార్‌లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి 8 మనీలా ఉరితాళ్లను తెప్పిస్తున్నారు. ఇవి మృదువుగా, బలంగా ఉండేలా చూడటంతో పాటు దోషులు తక్కువ బాధతో ప్రాణాలు విడిచేందుకు వీలుగా తాళ్లకు వెన్నపూస రాయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.
 
కాగా, జైలు నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకూ ఒకసారి దోషులు తమ కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిస్తున్నామని తెలిపిన అధికారులు, వారు నిత్యమూ న్యాయవాదులను కలుస్తూ, తమ కేసు పురోగతిని తెలుసుకుంటున్నారని, వారి ప్రవర్తనలో తాము ఎటువంటి మార్పునూ గమనించలేదని చెబుతున్నారు.