గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:15 IST)

భారత రత్న ప్రచారం ఆపండి ప్లీజ్: రతన్ టాటా విజ్ఞప్తి

తనకు ‘భారత రత్న’ ఇవ్వాలంటూ జరుగుతున్న ప్రచారంను ఆపాలని పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కోరారు. 100 బిలియన్ డాలర్ల విలువైన టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటాకు ‘భారత రత్న’ ఇవ్వాలని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై రతన్ టాటా శనివారం ట్విటర్ వేదికగా స్పందించారు. 
 
‘‘ఓ అవార్డు గురించి సోషల్ మీడియాలో ఓ సెక్షన్ వ్యక్తం చేసిన సెంటిమెంట్స్‌ను నేను అర్థం చేసుకున్నాను. అయితే ఈ ప్రచారాలను నిలిపేయాలని వినయపూర్వకంగా కోరుతున్నాను. భారతీయుడిని కావడం, భారత దేశ అభివృద్ధి, సౌభాగ్యాల కోసం కృషి చేయడం  నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని రతన్ టాటా ట్వీట్ చేశారు. 
 
‘భారత రత్న ఫర్ రతన్ టాటా’ హ్యాష్‌ట్యాగ్‌తో జరుగుతున్న ప్రచారంపై రతన్ టాటా స్పందిస్తూ ఈ ట్వీట్ చేశారు. దీనిపై కూడా యూజర్లు స్పందిస్తూ, ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నందువల్లే తమకు ఆయన ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తున్నారని పేర్కొంటున్నారు. టాటా గ్రూప్ మన దేశానికి సాటిలేని సేవలందిస్తోందని చెప్తున్నారు. 
 
రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలగారు. అప్పటి నుంచి ఆయన వ్యక్తిగత హోదాలో యువతను ప్రోత్సహిస్తున్నారు. స్టార్టప్‌ కంపెనీలను ఏర్పాటు చేసేవారిని ప్రోత్సహిస్తున్నారు.