పుదుచ్చేరి ప్రజలకు శుభవార్త - గ్యాస్ బండపై రూ.300 రాయితీ
పుదుచ్చేరి ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి శుభవార్త చెప్పారు. ఆయన సోమవారం 2023-24 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరికీ వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.300 మేరకు రాయితీ కల్పించనున్నట్టు తెలిపారు. ఈ రాయితీ 12 నెలల పాటు 12 సిలిండర్లకు కొనసాగుతుందని ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ రాయితీ ద్వారా ప్రభుత్వ ఖజనాపై రూ.126 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని ఆయన చెప్పారు.
కాగా, సోమవారం మొత్తం రూ.11,600 కోట్ల వ్యయ ప్రణాళికతో ఆయన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన చేసిన బడ్జెట్ ప్రసంగంలో అనేక ప్రజలకు సానుకూలంగా ప్రకటనలు చేశారు. ముఖ్యంగా, ప్రజలపై ఎలాంటి పన్నుల భారాన్ని ఆయన మోపలేదు. వంట గ్యాస్ భారాన్ని కొంతమేరకు తగ్గించే ప్రయత్నం చేశారు. మెరుగైన విద్యాప్రమాణాల కల్పనలో భాగంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేయనున్నట్టు తెలిపారు.
ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యా విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా, పుదుచ్చేరిలో జన్మించిన ఆడ శిశువుల పేరిట రూ.50 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, వారు మైనార్టీ అంటే 18 యేళ్లు నిండిన తర్వాత ఆ డబ్బును అందజేస్తామని తెలిపారు. వృత్తి విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మార్కుల ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహక బహుమతిని రూ.1000కి పెంచుతున్నట్టు తన ప్రసంగంలో పేర్కొన్నారు.