శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (21:07 IST)

దేశంలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ మొదలైంది. దీనికి నిదర్శనమే గత 24 గంటల్లో ఏకంగా 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌బారిన సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా వైరస్ సోకింది. అలాగే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారిక నివాసంలో ఏకంగా 40 మందికి ఈ వైరస్ సోకడం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. 
 
ఇపుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే, తనలో కరోనా లక్షణాలు పెద్దగా లేవని, వైద్యుల సలహా మేరకు వారం రోజుల పాటు హోం ఐసోలేషన్‌కు పరిమితం కానున్నట్టు తెలిపారు. 
 
అలాగే, కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం గత నాలుగైదు రోజులుగా తనను కలిసినవారందరూ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, కరోనా నిబంధనలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆయన కోరారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కరోనా టీకాలు కూడా వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.