1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (10:19 IST)

దేశంలో లక్షకు చేరువైన పాజిటివ్ కేసుల - కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రికి కరోనా

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తారాస్థాయికి చేరింది. దీంతో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా లక్షకు చేరువైంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 90,928 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం వెల్లడించిన కేసులతో పోల్చితే రెట్టింపు అయ్యాయి. 
 
గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు... గత 24 గంటల్లో మొత్తం 90928 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19206 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, 325 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 285401 కరోనా కేసులు యాక్టివ్‌‌గా ఉన్నాయి. ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,43,41,009గా ఉండగా, ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,82,876గా వుంది. 
 
అలాగే, ఈ కరోనా రోగుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్‌ కూడా ఉన్నారు. ఆమెకు కూడా కోవిడ్ వైరస్ సోకింది. ఆమెకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే ఉన్నారు. తనను కలిసినవారంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు.