బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (14:11 IST)

భారత్‌లో కోవిషీల్డ్ ధర ఖరారు : ప్రభుత్వ - ప్రైవేటుకు వేర్వేరు ధరలు..

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, ప్రస్తుతం కొన్ని రంగాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటివాటిలో కోవిషీల్డ్ ఒకటి. పూణె కేంద్రంగా సీరం ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే, కోవిషీల్డ్ ధరను సీరం ఇనిస్టిట్యూట్ బుధవారం ప్రకటించింది. 
 
ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.400 అని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 అని తెలిపింది. రాబోయే రెండు నెలల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచుతామని పేర్కొంది. 
 
కోవిషీల్డ్‌ ధరతో ఇతర దేశాల్లోని వ్యాక్సిన్ల ధరలను పోల్చి చెప్తూ, అమెరికన్ వ్యాక్సిన్ల ధర ఒక డోసు సుమారు రూ.1,500 ఉందని తెలిపింది. రష్యా, చైనా వ్యాక్సిన్ల ఒక డోసు ధర రూ.750కి పైనే ఉందని వివరించింది. 
 
ఇకపోతే, తాము ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ సామర్థ్యంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామని తెలిపింది. 
 
రిటైల్ వ్యాపారంలో ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయడం సవాలుతో కూడుకున్నదని వివరించింది. రిటైల్, స్వేచ్ఛా విపణిలో ఈ వ్యాక్సిన్ సుమారు నాలుగైదు నెలల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపింది.