కరోనా ప్రభావం సినిమా థియేటర్లపైనా పడింది. వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో రేపటి నుంచి థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏకగీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడం..రోజు రోజూకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ఏప్రిల్23న విడుదల కావాల్సిన పలు సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఈనెల 26న అనుకున్న `టక్ జగదీష్` కూడా ఎప్పుడో వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పటి పరిస్థితి రీత్యా దాదాపు మే నెల వరకు సినిమాల ప్రదర్శన ఉండబోవని సినీవర్గాలు తెలియజేస్తున్నాయి. యాభైశాతం సీటింగ్ వున్నా ప్రేక్షకులు వస్తారో రారో అనే సందిగ్థం నెలకొంది.
ఇదిలా వుండగా, మంగళశారంనాడు అత్యవసర సమావేశమైన ఎగ్జిబిటర్లు థియేటర్ల ప్రదర్శనపై సమావేశం నిర్వహించారు. అయితే అందులో కేవలం మల్టీప్లెక్స్‌లు బంద్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మల్టీప్లెక్స్‌లోనే షాపింగ్ మాల్స్ కూడా వుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కర్వ్యూ కూడా వాటికి వర్తిస్తుందని వారు చర్చల సందర్భంగా తెలిపారు.
అయితే మామూలు థియేటర్లు రన్ చేయడానికి కొందరు ఎగ్జిబిటర్లు సంసిద్ధమయ్యారు. అవేవీ కమర్షియల్ కాంప్లెక్స్ కాదు కనుక వాటిని రన్ చేయవచ్చని సమావేశంలో ఇరు వర్గాల ఎగ్జిబిటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే వర్మ `దెయ్యం` వంటి కొన్ని చిన్న సినిమాలు ఆయా థియేటర్లలో ప్రదర్శన జరుగుతోంది. మరి కొద్దిరోజుల్లో ఆ నిర్ణయం కూడా మారిపోవచ్చని తెలుస్తోంది.
ఫైనల్‌గా. వకీల్ సాబ్ సినిమా ప్రదర్శించే థియేటర్లు మినహా మిగితా వాటిని మూసివేయాలని సమావేశంలో నిర్ణయించారు.
కరోనా ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్ల నిర్వాహకులు తెలిపారు.