పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన : సుప్రీంకోర్టులో పిటిషన్
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఆ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకుని, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
ఈ తర్వాత కేంద్రానికి, రాష్ట్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మే నెల 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి పరిస్థితి క్షీణించిందని పిటిషన్లు దాఖలయ్యాయి.
బెంగాల్‌కు సైన్యాన్ని, పారా మిలిటరీ దళాలను తరలించాలని, పరిపాలనను సాధారణ స్థితికి తీసుకుని వచ్చి, ప్రజల్లో నమ్మకాన్ని పెంచడంతో పాటు, అంతర్గత భద్రతపై దృష్టిని సారించి, జరిగిన హింసపై ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కాగా, ధర్మాసనం విచారించింది.
ఈ పిటిషన్‌ను జస్టిస్ వినీత్ శరన్, దినోష్ మహేశ్వరి విచారణకు స్వీకరించారు. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో నష్టపోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలో కూడా మమతా బెనర్జీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
కాగా, ఈ పిటిషన్‌ను రంజానా అగ్నిహోత్రి అనే యూపీ ప్రాక్టీస్ న్యాయవాదితో పాటు సామాజిక కార్యకర్త జితీందర్ సింగ్ దాఖలు చేయగా, వారి తరఫున న్యాయవాది హరి శంకర్ జైన్ వాదనలు వినిపించారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీకి మాత్రం వ్యక్తిగతంగా నోటీసులను ఇవ్వలేదు.