తమిళనాడులో కరోనా ఉధృతి - 31 వరకు విద్యాసంస్థలకు సెలవు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకుంది. రోజుకు దాదాపు 24 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్క రాజధాని చెన్నైలోనే దాదాపు పదివేల వరకు కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తి కట్టడి కోసం అనేక ఆంక్షలను విధించి అమలు చేస్తుంది. ముఖ్యంగా, ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తుంది.
అలాగే, ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవుల కారణంగా విద్యా సంస్థలు మూసివేశారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 31వ తేదీ వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థులకు జరుగుతూ వచ్చిన భౌతిక తరగతులను కూడా రద్దు చేశారు. అలాగే, అన్ని రకాల పరీక్షలను కూడా వాయిదావేశారు.