శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (11:09 IST)

ఆవును ఆన్‌లైన్‌లో పెట్టాడు.. లక్ష రూపాయలు కోల్పోయాడు.. ఎలాగంటే?

ఆన్‌లైన్ అమ్మకాలు జోరందుకుంటున్నాయి. ఆన్‌లైన్ కొనుగోళ్లతో పాటు అమ్మకాలు కూడా అదే స్థాయిలో వున్నాయి. అదే సమయంలో సైబర్ నేరగాళ్ల కూడా జనాలను బురిడి కొట్టించేందుకు తమ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. పక్కగా స్కెచ్ వేసి జనాల దగ్గర నుంచి డబ్బులు దోచేస్తున్నారు.

తాజాగా ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆవును విక్రయించేందుకు చూసి డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు భువనేశ్వర్‌లోని భరత్‌పూర్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు.
 
వివరాల్లోకి వెళితే.. దేబాశిష్ సాహు అనే వ్యక్తి మార్చి 11వ తేదీన తన ఆవును అమ్మడం కోసం ఆన్‌లైన్‌లో ఒక ప్రకటన ఉంచాడు. ఇది చూసిన సైబర్ నేరగాడు ఒకరు.. సాహుకు ఫోన్ చేశాడు. తన పేరు మంజిత్ అని ఆర్మీ అధికారినని పరిచయం చేసుకున్నాడు. 
 
ఆవును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. దీంతో ఆవును కొనుగోలు చేయడానికి సైబర్ నేరగాడు.. సాహుతో రూ. 20వేలకు డీల్ కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత మనీ ట్రాన్స్‌ఫర్ అవుతాయని చెప్పి సైబర్ నేరగాడు సాహుకు ఓ క్యూఆర్ కోడ్ పంపాడు. అయితే అది స్కాన్ చేయగా సాహు అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి. ఇలా ఐదు సార్లు క్యూఆర్ కోడ్ పంపిన సైబర్ నేరగాడు.. సాహు వద్ద నుంచి లక్ష రూపాయలు దోచేశాడు.
 
"మొదట అతడు నాకు క్యూఆర్ కోడ్ పంపాడు.. అది స్కాన్ కోడ్‌ను పంపాడు. నేను దానిని నా ఫోన్‌లో స్కాన్ చేయగానే.. నా బ్యాంక్ ఖాతాలో 5 రూపాయలు జమ అయ్యాయి. తనపై నమ్మకం కలిగేలా చేసి మరో క్యూఆర్ కోడ్‌ను పంపాడు. అప్పుడు నా అకౌంట్‌లో నుంచి రూ. 20వేలు డెబిట్ అయ్యాయి. దీని గురించి అతడిని ప్రశ్నించగా.. సాంకేతిక లోపం కారణంగా అలా జరిగిందని చెప్పాడు. 
 
ఆ డబ్బులు తిరిగి పొందాలంటే మరో కోడ్‌ను స్కాన్ చేయమని చెప్పాడు.. ఇలా చేయడం ద్వారా రూ. లక్ష కోల్పోయాను" అని సాహు చెప్పాడు. ఇక, ఈ ఘటన అనంతరం తనలాగా ఆన్‌లైన్ మోసాలకు బలికావద్దని ఆయన ప్రజలకు కోరుతూ ఓ వీడియో విడుదల చేశాడు. ఇక, కష్టపడి సంపాదించిన డబ్బును సైబర్ నేరగాళ్ల దోచుకోవడంతో సాహు సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.