షియోమీకి షాక్.. దిగుమతిని ఆపండి.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీకి షాక్ తగిలింది. ఆ కంపెనీకి చెందిన అన్ని ఉత్పత్తుల తయారీ, అమ్మకాలతోపాటు దిగుమతిని కూడా నిలిపివేయాలని కోరుతూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫిలిప్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తమ కంపెనీకి చెందిన పలు పేటెంట్లను షియోమీ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఫిలిప్స్.. కోర్టులో కేసు వేసింది.
షియోమీకి చెందిన ఉత్పత్తుల తయారీ, అసెంబ్లింగ్, దిగుమతితోపాటు అడ్వర్టయిజ్‌మెంట్లను కూడా నిలిపివేయాలని ఫిలిప్స్ తన పిటిషన్‌లో కోర్టును కోరింది. తమ కంపెనీకి చెందిన హెచ్ఎస్‌పీఏ, హెచ్ఎస్‌పీఏ ప్లస్, ఎల్టీఈ టెక్నాలజీలకు చెందిన పేటెంట్లను షియోమీ ఉల్లంఘించిందని ఫిలిప్స్ ఆరోపించింది.
అయితే ఫిలిప్స్ పిటిషన్ పై స్పందించిన కోర్టు ఆ కంపెనీని బ్యాంకుల్లో రూ.1000 కోట్ల నగదు నిల్వలను మెయింటెయిన్ చేయాలని ఆదేశించింది. ఇక ఈ కేసును జనవరి 18వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆ రోజు కోర్టు ఏం తీర్పు ఇస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.