మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (14:24 IST)

మహిళా ఉద్యోగులకు రుతుస్రావం సమయంలో పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి..

డైలీ వేజ్, కాంట్రాక్చువల్, ఔట్‌సోర్స్‌డ్ విధానాల్లో నియమితులైన అన్ని తరగతుల మహిళా ఉద్యోగులకు రుతుస్రావం సమయంలో వేతనాలతో కూడిన సెలవులను మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. రుతుస్రావం సమయంలో వేతనాలతో కూడిన సెలవులను, ఇతర సదుపాయాలను మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. 
 
ఈ పిటిషన్‌ను వినతి పత్రంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతర వ్యవస్థలను కోరింది. దీనిపై నిర్ణీత కాలంలో స్పందించాలని ఆదేశించింది. సరైన స్పందన రాని పక్షంలో తగిన వ్యవస్థను ఆశ్రయించవచ్చునని పిటిషనర్లకు తెలిపింది.
 
ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను వినతి పత్రంగా పరిగణించాలని, దీనిలో పేర్కొన్న అంశాలపై చట్టాలు, ప్రభుత్వ విధానాలకు లోబడి నిర్ణీత కాలంలో స్పందించాలని ఆదేశించింది.
 
ఢిల్లీ లేబర్ యూనియన్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దాఖలు చేసింది. మహిళా ఉద్యోగులకు రుతుస్రావం సమయంలో ప్రత్యేక కాజువల్ లీవ్స్ లేదా పెయిడ్ లీవ్స్ మంజూరు చేయాలని కోరింది. ప్రత్యేక, పరిశుభ్రమైన మరుగుదొడ్డి సదుపాయం కల్పించాలని ఆదేశించాలని కోరింది. నియమిత కాలం అనంతరం విశ్రాంతి పొందేందుకు అవకాశం కల్పించాలని, ఉచితంగా శానిటరీ నాప్‌కిన్స్ అందజేయాలని ఆదేశించాలని కోరింది.