మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (20:18 IST)

'మహా వికాస్ అఘాడి' నేతగా ఉద్ధవ్ ఠాక్రే.. శివాజీ పార్కులో ప్రమాణ స్వీకారం

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి పేరుతో ఓ కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూడు పార్టీల 160కు పైగా చేరింది. అదేసమయంలో ఆ కూటమి నేతగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. ఆయన డిసెంబరు ఒకటో తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం శివాజీ పార్కును సిద్ధం చేస్తున్నారు. 
 
ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం రాజీనామా చేశారు. ఆ తర్వాత శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో సమావేశమై తమ కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. ఈ కూటమి పేరును మహా వికాస్ అఘాడిగా నిర్ణయించారు. 
 
ప్రమాణస్వీకారం ఏర్పాట్లను శివాజీ పార్క్‌లో చేయనున్నట్టు కూటమి వర్గాలు తెలిపాయి. డిప్యూటీ సీఎంలుగా జయంత్‌పాటిల్‌, బాలా సాహెబ్‌ థోరాట్‌ ప్రమాణం చేయనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశం కానుంది. ప్రొటెమ్‌ స్పీకర్‌గా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్‌ కోలాంబ్కర్‌.. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
 
మరోవైపు, శివసేనపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార దాహంతో సిద్ధాంతాలను పక్కన పెట్టారంటూ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ప్రజల గొంతును బలంగా వినిపిస్తామన్నారు. అభివృద్ధి కోసం ఐదేళ్లు చాలా కష్టపడ్డామని.. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై తాము సంతృప్తితో ఉన్నామన్నారు. 
 
రాష్ట్రపతి పాలన వద్దనే ఉద్దేశంతో ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ తమతో చేతులు కలిపారని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు లేఖతోనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా తనతో వస్తారని అజిత్ పవార్ భావించారనీ కానీ అలా జరగలేదన్నారు. అందుకే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. 
 
పైగా, తమకు పార్టీలను చీల్చే ఉద్దేశం ఏమాత్రం లేదన్నారు. బీజేపీని శివసేన మోసం చేసిందని ఆరోపించారు. సీఎం పదవి విషయంలో ఎన్నికల ముందు శివసేనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టంచేశారు. సీఎం పదవి కోసం బీజేపీని శివసేన బెదిరించిందని ఫడ్నవీస్ ఆరోపించారు. అంతేకాకుండా, హిందుత్వవాదాన్ని శివసేన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్ద తాకట్టుపెట్టిందని ఫడ్నవిస్ ఆరోపించారు.