మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (16:50 IST)

యూపీలో ఉప్పొంగుతున్న గంగా - యమునా నదులు

ఉత్తరభారతంలోని గంగా, యమునా నదులు ఉప్పొంగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో గంగ, యమునా నదులు ఉప్పొంగుతున్నాయి. 
 
ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదుల నీటిమట్టం ప్రమాదకరస్థాయికి (84.73 మీటర్ల) చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో జనం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. 
 
గంగా నీటిమట్టం ఫఫమౌలో 84.03 మీటర్లు, ఛట్నాగ్‌లో 83.30 మీటర్లకు చేరింది. నైనీ వద్ద యమునా నది నీటిమట్టం 83.88 మీటర్లకు పెరిగింది. భారీ వరదల కారణంగా నదుల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం సాయంత్రానికి వరద మరింత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని యూపీ నీటిపారుదల శాఖ అంచనా వేసింది. 
 
గంగా నగర్, నెవాడ, అశోక్ నగర్, బెలి, రాజాపూర్, సలోరి, బడా, చోటా బాఘారా, బదర్, సనౌతి, దారగంజ్, నాగవాసుకి తదితర ప్రాంతాల్లో వరద నీరు చేరింది. యమునలో నీటిమట్టం నిరంతరం పెరుగుతుండడంతో బాలుఘాట్ నది ఒడ్డున ఉన్న బరదారి గ్రామంలోకి వరద నీరు చేరింది.
 
మరోవైపు, వారణాసిలో గంగానది నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. వరదలతో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. గంగా నీటిమట్టం ఇప్పటికే 70.26 మీటర్ల హెచ్చరిక స్థాయిని దాటిందని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ గంగా డివిజన్‌ బులిటెన్‌లో తెలిపింది. 
 
వరదల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.