ముఖ్యమంత్రుల్ని ఏకం చేసే పనిలో విజయన్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బీజేపీయేతర ముఖ్యమంత్రుల్ని ఏకం చేసే పనిలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిమగ్నమయ్యారు. సీఏఏను వ్యతిరేకించాలని 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు.
కేంద్ర ప్రభుత్వం సీఏఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం ఇతర రాష్ట్రాల్లో కూడా సీఏఏకు వ్యతిరేకంగా ఆయా ప్రభుత్వాలు తీర్మాణాలు చేయాల్సిన అవసరాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
‘‘భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక విధానానికి సీఏఏ ప్రమాదకరం. మనదేశ పౌర సమాజంలోని మెజారిటీలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మనం కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
వాటికి అనుగుణంగా మనం స్వీయ నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యతిరేక విషయాల్లో ఆ అధికారాలు తప్పక వినియోగించుకోవాలి’’ అని ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో విజయన్ పేర్కొన్నారు.
ప్రతిసారీ పాకిస్థాన్‌తో పోలికేంటి?: మమత
ప్రధానమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గొప్ప సంస్కృతి, విలువలున్న మన దేశాన్ని మోదీ ప్రతిసారీ ఎందుకు పాకిస్థాన్‌తో పోల్చి చూస్తున్నారని ధ్వజమెత్తారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటామని ఉద్ఘాటించారు.
భారతదేశాన్ని ప్రతిసారీ పాకిస్థాన్‌తో ఎందుకు పోల్చుతున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సిలిగుడి ర్యాలీలో పాల్గొన్న ఆమె.. మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినప్పటికీ.. పౌరసత్వం నిరూపించుకోవాల్సి రావడం సిగ్గుచేటని మండిపడ్డారు.