అనురాధ పౌడ్వాల్ నా తల్లి: తిరువనంతపురంలో కోర్టులో మహిళ పిటిషన్
కేరళకు చెందిన 45 ఏళ్ల కర్మలా మోడెక్స్.. బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ తన తల్లి అంటూ శుక్రవారం ఉదయం తిరువనంతపురంలో ఉన్న ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అనురాధ, ఆమె భర్త తన తల్లిదండ్రులంటూ పిటిషన్‌లో పేర్కొంది. 1974లో తనకు నాలుగు రోజుల వయసు ఉన్నప్పుడు వేరే వాళ్లకి దత్తత ఇచ్చి వెళ్లిపోయారని, అనురాధ తన సింగింగ్ కెరీర్‌కు ఆటంకం కలగకూడదనే ఇలా చేసిందంటూ పిటిషన్‌లో పేర్కొంది.
తనను వదిలివెళ్లినందుకు పౌడ్వాల్ దంపతులు రూ. 50 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని మోడెక్స్ పేర్కొనడం విశేషం. వీటిన్నింటికి తన దగ్గర ఆధారాలున్నాయని, తనను పెంచిన ఫాదర్ చనిపోయేముందు అన్ని విషయాలు తనకు చెప్పాడని కర్మలా వెల్లడించారు. అంతేకాదు తన తల్లిని కలిసేందుకు ప్రయత్నించి చాలాసార్లు విఫలమయ్యానని పేర్కొన్నారు.
పిచ్చి వ్యాఖ్యలను పట్టించుకోను: అనురాధ పౌడ్వాల్
'నేను ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలను పట్టించుకోను. అయినా ఇలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆమె నా గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ' గాయని అనురాధ మండిపడ్డారు. ఆమె తన కూతురు కాదని.. అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ తీవ్రంగా మండిపడ్డారు.
ఇదే విషయమై అనురాధ పౌడ్వాల్ ప్రతినిధి మాట్లాడుతూ... కర్మలా ఒక సైకోలాగా ప్రవర్తిసుందని తెలిపారు. అనురాధకు కూతురు ఉన్న విషయం నిజమేనని, అయితే ఆమె పేరు కవిత అని పేర్కొన్నారు. వాళ్లిద్దరు నా తల్లిదండ్రులు అని చెబుతున్న కర్మలాకు తండ్రి చనిపోయాడన్న విషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఒకవేళ ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే రూ. 50 కోట్లు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేస్తుందో చెప్పాలని మండిపడ్డారు.
బాలీవుడ్ గాయనీగా ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన అనురాధను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1969లో అరుణ్ పౌడ్వాల్‌ను ఆమె పెళ్లాడారు. వారికి కొడుకు ఆదిత్య, కూతురు కవితలు సంతానం.