బెంగాల్ దంగల్ : ఫలితాలకు ముందే మేల్కొన్న మమత!!
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీగా జరిగాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. ఈ క్రమంలో మే రెండో తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది. అయితే, ఈ ఎన్నికలపై వెల్లడైన ముందస్తు సర్వే ఫలితాల్లో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ స్వల్ప మెజారిటీ లేదా లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ సహకారంతో తిరిగి అధికారం దక్కించుకుంటుందని పలు టీవీ ఛానెల్స్ నిర్వహించిన సర్వే ఫలితాల్లో వెల్లడైంది.
ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. మే 2న జరిగే కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇస్తారని టీఎంసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
అభ్యర్థులంతా తమ కౌంటింగ్ ఏజెంట్లతో వర్చువల్ సమావేశానికి హాజరు కావాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీపై మమతా ధీమాగా ఉన్నారు. లెక్కింపు ప్రక్రియలో బీజేపీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనే ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తన ఎన్నికల ప్రచార సమయంలో ఆమె ఎన్నికల కమిషన్‌పై పలుసార్లు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌పై సైతం విశ్వాసం లేదని, ఈ మేరకు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు ఆమె నిర్ధిష్ట మార్గదర్శకాలు జారీ చేస్తారని సదరు నేత పేర్కొన్నారు.
ప్రస్తుతం బీజేపీ బెంగాల్‌పై దృష్టి సారించినందున.. విజయం సాధించేందుకు దేనికైనా ప్రయత్నం చేయొచ్చు అని మరో నేత ఆరోపించారు. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం ముమ్మరంగా ప్రచారం చేయగా.. టీఎంసీ తరపున మమతా బెనర్జీ అన్ని తానై ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సమయంలో తన కాలికి దెబ్బతగిలినా ఆమె వీల్ చైర్‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు.