బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:18 IST)

టీఎంసీ ఫిర్యాదులు బుట్టదాఖలు.. బీజేపీ ఫిర్యాదుకు నోటీసులు

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో విధంగా మలుపు తిరుగుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికలు ముగిశాయి. మరో ఐదు దశల్లో ఎన్నికలు జరగాల్సిఉంది. ఈ తరుణంలో టీఎంసీ, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకుంటున్నాయి. 
 
బీజేపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ మమతా బెనర్జీకి నోటీసులిచ్చింది. మూడో దశ ఎన్నికల ప్రచారంలో మతం పేరు ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం బుధవారం నోటీసు జారీ చేసింది. 48 గంటల్లో బదులివ్వకపోతే చర్యలు తీసుకుంటామంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
ముస్లింలు తమ ఓట్లు చీలిపోయేలా వేర్వేరు పార్టీలకు వేయొద్దని, అందరూ టీఎంసీకే ఓటు వేయాలని ఓ సభలో మమత కోరారని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. మమతలాగా తాము హిందువులకు ఇలా పిలుపునిచ్చి ఉంటే తమ పార్టీపై ఈసీ చర్యలు తీసుకొని ఉండేదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగాల్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మరుసటి రోజే ఈసీ ఈ చర్య తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
 
ఈసీ నోటీసులపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు స్పందించారు. దీనిపై ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. బీజేపీ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ మమతా బెనర్జీకు నోటీసు జారీ చేసింది. అయితే.. టీఎంసీ చేసిన ఫిర్యాదుల గురించి ఏమిటీ అంటూ మొయిత్రా ట్వీట్ చేశారు.