శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (13:07 IST)

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షమెప్పుడు?

ప్రస్తుతం మహిళలు అన్నిరంగాల్లో అత్యున్నత స్థానాలకు ఎదుగుతున్నారు. ఎన్నికల ప్రక్రియలోనూ వారి భాగస్వామ్యం పెరిగింది. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో వారి స్థానం ఎక్కడ? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటని అడిగితే దేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరి నోరు పెగలదు. 
 
కారణం.. గత పార్లమెంటునే చూస్తే మహిళల ప్రాతినిధ్యం కేవలం 11 శాతం. అంటే ప్రతి 90 లక్షల మంది మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఒక్క మహిళ మాత్రమే. ఈ పరిస్థితి మారాలి అంటే అందరి నుంచి వినిపించే డిమాండ్‌... రాజకీయాలలో మహిళల పాత్ర పెరగాలి.. అందుకు చట్టసభల్లో వారికి రిజర్వేషన్లు కల్పించాలి అని. 
 
కానీ దశాబ్దాలు మహిళా రిజర్వేషన్ల బిల్లు మాత్రం పార్లమెంట్ గడప దాటడం లేదు. ఆ సుదీర్ఘ నిరీక్షణకు మోక్షం ఎప్పుడో పాలకులకే తెలియాలి. పైకి మాత్రం అన్ని పార్టీల నేతలు మహిళా బిల్లును తక్షణం పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించాలని ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ, చేతల్లో మాత్రం చురుకుదనం చూపించడం లేదు. మహిళా బిల్లును సభలో ప్రవేశపెట్టినపుడల్లా ఏదో ఒక పార్టీకి చెందిన సభ్యులు అడ్డుకుంటున్నారు. ఫలితంగా ఈ బిల్లు మళ్లీ అటెకెక్కుతుంది.