కాన్పూర్‌లో జికా వైరస్: పదికి చేరిన కేసులు..
ఉత్తరప్రదేశ్ కరోనా కట్టడిలో సమర్థవంతంగా పనిచేస్తోంది. తాజాగా జికా వైరస్ యూపీని కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఇటీవల జికా వైరస్ కేసులు అధికమవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఆదివారం రోజున కొత్తగా మరో ఆరు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఉత్తరప్రదేశ్‌లో జికా వైరస్ కేసులు పదికి చేరాయి.
ఈ అంశంపై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అధికారులతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. జికా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జికా వ్యాధి వచ్చిన వారికి క్లోజ్‌గా ఉన్నవారి నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు. ఇప్పటి వరకు ఇలా 654 నమూనాలను కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకీ తరలించారు. ఇప్పటి వరకు 507 నమూనాలను పరీక్షిస్తే 9 మందికి పాజిటివ్‌గా తేలింది.
అక్టోబర్ 22న యూపీలో మొదటి జికా కేసు నమోదైంది. ముఖ్యంగా దోమల వల్ల జికా వైరస్ వ్యాపిస్తుంది. దీంతో కాన్పూర్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు. దోమల ఆవాసాలుగా ఉన్న ప్రాంతాల్లో ఫాగింగ్ చేస్తున్నారు. మరోవైపు జికా వ్యాధిగ్రస్తుల కోసం కాశీరామ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.