మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 7 నవంబరు 2019 (14:38 IST)

పెళ్లయినా అతడే కావాలనిపిస్తోంది, ఈ పిచ్చి వదిలేదెలా?

మా ఇంటికి ప్రక్కనే ఏడాది క్రితం పెళ్లయిన కొత్త జంట అద్దెకు దిగారు. వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉంటారు. ఇల్లు అద్దెకు దిగాక ఓ పండుగ ఫంక్షనుకు ఆమె మమ్మల్ని పిలిచారు. అమ్మ, నేను వెళ్లాము. వారి ఇంటికి వెళ్లగానే ఆమె భర్త పలుకరింపుగా నవ్వుతూ మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు. ఎందుకో... ఆ నవ్వు సూటిగా నా గుండెల్లో గుచ్చుకున్నట్లనిపించింది. ఫంక్షన్ జరుతున్నంతసేపూ అతడినే చూస్తూ ఉండిపోయాను. 
 
ఆ తర్వాత కూడా అతడంటే ఎందుకో నాకు తెలియని ఇష్టం ఏర్పడింది. ఇంట్లో నుంచి ఎప్పుడు అతడు బయటకు వస్తాడా అని చూసిన రోజులు చాలా ఉన్నాయి. అతడికి 30 ఏళ్లుంటాయి. నా వయసు 20. అతడు నవ్వు నాకు కావాలనిపిస్తోంది. అతడి నవ్వుతో పాటు అతడు కూడా కావాలని మనసు ఉవ్విళ్లూరుతోంది. 
 
ఐతే అతడి భార్య అమ్మ దగ్గరకు వచ్చిపోతుంటుంది. నాలో రేగిన ఆలోచనలు ఆమెను చూసినప్పుడు ముడుచుకుపోతాయి. ఆమె చాలా మంచివారు. ఆమె భర్తను నేనిలా ఊహించుకోవడం చాలా తప్పు అనిపిస్తుంది. కొన్ని గంటలు మాత్రమే అలా ఉంటాను. ఐతే మళ్లీ మరుసటి రోజు నుంచి మామూలే. ఈ పిచ్చి ఆలోచనల నుంచి నేను బయటపడే మార్గం ఏమిటి...?
 
మంచి మనసు, మంచి ఆహ్లాదకరమైన నవ్వు, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులు... అంటే, వారు స్త్రీ లేదా పురుషుడు... ఎవరైనా కావచ్చు. వారంటే సహజంగా ఇష్టం ఏర్పడుతుంది. ఐతే ఆ ఇష్టం అంతవరకే ఉండాలి. కానీ పరాయి స్త్రీ భర్తను కావాలనుకునే స్థాయికి వెళ్లకూడదు. కనుక మీరు మరీ అతడి ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నట్లయితే కొన్నాళ్లు మీ బంధువుల ఇంటికి వెళ్లండి. మనసును కెరీర్ పైన నిలిపి, మీ తల్లిదండ్రులు మీపై ఉంచిన ఆశలను నెరవేర్చేందుకు నడుం బిగించండి. అవన్నీ మీ కళ్లముందు ఉంటే ఇలాంటి పక్కింటి పురుషుని నవ్వులన్నీ మీ ముందు మరుగుజ్జులా మారిపోతాయి.