చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద ... విశ్వనాథ్ ఆనంద తర్వాత...
తమిళనాడు రాష్ట్రానికి చెందిన భారత యువ చెస్ సంచలనం ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సోమవారం జరిగిన సమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకు ఆటగాడు ఫాబియానో కరువానాను మట్టికరిపించిన ప్రజ్ఞానంద.. తుదిపోరులో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్లెన్‌తో తాడో పేడో తేల్చుకోనున్నాడు.
అంతకుముందు సెమీస్ పోరు హోరాహోరీగా సాగింది. అగ్రశ్రేణి ఆటగాడైన అమెరికా గ్రాండ్ మాస్టర్ కరువానాకు గట్టి పోటీనిచ్చిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద.. టైబ్రేక్‌లో కూడా ఏమాత్రం పట్టు సడలించకుండ పోరాటం చేశాడు. మొదట తొలి రెండు క్లాసికల్ గేమ్‌లు డ్రా కావడంతో పోరు టైబ్రేకు మళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం టైబ్రేక్‌లో భాగంగా జరిగిన తొలి రెండు ర్యాపిడ్ గేమ్‌లు కూడా డ్రా అయ్యాయి.
తొలి గేమ్ నల్లపావులతో ఆడిన చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద 71 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత గేమ్‌లో తెల్లపావులతో ఆడి 53 ఎత్తుల్లో ప్రత్యర్థిని నిలువరించాడు. దీంతో ర్యాపిడ్ రెండో రౌండ్‌కు తెరలేచింది. తొలి గేమ్ తెల్లపావులతో ప్రజ్ఞానంద ఆధిపత్యం చలాయించాడు. కరువానా నుంచి గట్టి సవాలును దాటుకుని 63 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఈ గెలుపుతో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రజ్ఞానంద.. ఆ తర్వాత రసవత్తరంగా సాగిన గేమ్‌ను 82 ఎత్తుల్లో డ్రా చేసుకుని ముందంజ వేశాడు.