శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 అక్టోబరు 2024 (23:34 IST)

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11: ఎట్టకేలకు బెంగళూర్‌కు ఓ విజయం, 34-32తో దబంగ్‌ ఢిల్లీపై పైచేయి

Kabaddi
ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయాలు చవిచూసిన బెంగళూర్‌ బుల్స్‌ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. మంగళవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీపై 34-32తో పైచేయి సాధించి, 2 పాయింట్ల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది. దబంగ్‌ ఢిల్లీకి ఇది ఐదు మ్యాచుల్లో రెండో ఓటమి కాగా, బెంగళూర్‌ బుల్స్‌కు ఇది ఐదు మ్యాచుల్లో తొలి విజయం కావటం గమనార్హం. బెంగళూర్‌ బుల్స్‌ తరఫున 11వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మ్యాట్‌పై అడుగుపెట్టిన జై భగవాన్‌ (11 పాయింట్లు) సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో బుల్స్‌కు విజయాన్ని అందించాడు. దబంగ్‌ ఢిల్లీ ఆటగాళ్లలో ఆషు మాలిక్‌ (13 పాయింట్లు) సూపర్‌ టెన్‌తో మెరిసినా ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. 
 
ప్రథమార్థం దబంగ్‌దే : 
వరుస పరాజయాలతో నైరాశ్యంలో ఉన్న బెంగళూర్‌ బుల్స్‌పై దబంగ్ ఢిల్లీ ధనాధన్ షో చేసింది. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలోనే 22-14తో ఏకంగా ఎనిమిది పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు ఆషు మాలిక్‌, వినయ్‌ అంచనాలు అందుకోవటంతో దబంగ్‌ ఢిల్లీకి ఎదురు లేకుండా పోయింది. కూతలో దబంగ్ ఢిల్లీకి బెంగళూర్‌ బుల్స్‌ పోటీ ఇచ్చినా.. డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోయింది. మెరుపు ట్యాకిల్స్‌తో ప్రథమార్థంలో ఓసారి బెంగళూర్‌ బుల్స్‌ను ఆలౌట్‌ చేసింది. 
 
బుల్స్‌ సూపర్‌ షో : 
సెకండ్‌హాఫ్‌లో దబంగ్‌ ఢిల్లీకి బెంగళూర్‌ బుల్స్‌ గట్టి పోటీ ఇచ్చింది. కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ కూతలో ముందుండి నడిపించగా.. డిఫెండర్లు సైతం ట్యాకిల్స్‌తో మెరిశారు. ఇదే సమయంలో దబంగ్‌ ఢిల్లీ సైతం పాయింట్లు ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. దీంతో ద్వితీయార్థంలో సమవుజ్జీగా పాయింట్లు సాధించినా ప్రథమార్థంలో కోల్పోయిన ఆధిక్యం బెంగళూర్‌ బుల్స్‌ను వెంటాడింది. ఆఖరు పది నిమిషాల్లో అదరగొట్టే ప్రదర్శన చేసిన బెంగళూర్‌ బుల్స్‌ స్కోరు సమం చేసి ఏకంగా ఆధక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ను దబంగ్‌ ఢిల్లీ నిలువరించినా.. జై భగవాన్‌ను ఆ జట్టు డిఫెండర్లు నిలువరించలేకపోయారు. 11 రెయిడ్‌ పాయింట్లతో మెరిసిన భగవాన్‌ బెంగళూర్‌ బుల్స్‌ను గెలుపు బాట పట్టించాడు. ఆటలో మూడోంతుల భాగం ఆధిక్యంలో నిలిచిన దబంగ్‌ ఢిల్లీ.. ఆఖర్లో బోల్తా పడింది.