శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (15:41 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక బరిలో 'మూడో' మనిషి చంద్రముఖి...

తెలంగాణ ప్రజాతంత్ర యుద్ధంలో మూడో మనిషి బరిలోకి దిగుతున్నారు. ఆమె పేరు చంద్రముఖి. ఆడ.. మగ కాకుండా ఉన్న వర్గమే మూడో వర్గం. అదేనండీ హిజ్రా (ట్రాన్స్‌జెండర్). ఈ వర్గానికి చెందిన చంద్రముఖి తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అదీకూడా వివాదాస్పద బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈమె గోషామాల్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనుంది. 
 
దీంతో ఇప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం వైపు మళ్లింది. అందరి కళ్లూ ఆ అభ్యర్థి వైపు చూస్తున్నాయి. ఈ వార్త విన్న కొందరు అవాక్కవుతున్నారు. మరికొందరు ఔరా అంటున్నారు. ఇంకొందు కిందా మీదా చూసి, ఎన్నికల్లో పోటీ చేయడమేంటని, నొసలు చిట్లిస్తున్నారు. 
 
అయితే, ఎవరు వింతగా చూసినా, విడ్డూరంగా మాట్లాడినా, ఎన్నికల్లో నిలబడి తీరుతాం హక్కుల సాధనకై చట్ట సభల్లో నినదిస్తామంటూ, ప్రజాతంత్ర యుద్ధంలో అడుగుపెట్టాలనుకుంటున్నాం అంటూ చంద్రముఖి తేల్చి చెప్పింది. పైగా ఈ ఎన్నికల్లో గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
 
గోషామహల్‌ బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా హిజ్రా చంద్రముఖి పోటీకి సిద్దమైంది. బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోటీకి రెడీ అంటోంది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్‌ చతుర్ముఖ పోరులో సత్తా చాటుతానంటోంది.
 
ఈ పోటీపై ఆమె స్పందిస్తూ, గోషామహల్‌ నియోజకవర్గంలో ఏళ్లతరబడి సమస్యలు తిష్టవేశాయని, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు అంతకుముందు ఎమ్మెల్యేలు కూడా పరిష్కరించలేదని ఆరోపిస్తోంది. ప్రధానంగా బాల కార్మికులు, గుడుంబాపై ఆధారపడిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ రెండు సమస్యలు పరిష్కరిస్తానని ఓటర్లకు హామీ ఇస్తోంది. 'మీ సమస్యలేంటో చెప్పండి, ఆ తర్వాతే ఓటేయండి' అంటూ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది.