జీహెచ్ఎంసీ ఆఫీసులో పామును వదిలిన యువకుడు.. ఎందుకో తెలుసా?
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైపోయింది. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచివుంది. ప్రధాన రహదారులన్నీ నీటి మునిగివున్నాయి. ఈ వర్షాల ధాటికి భాగ్యనగరి వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. నేడు, రేపు కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం హెచ్చించింది.
పలు ప్రాంతాల్లో మురుగు నీరు ఇళ్లలోకి చేరడంతో పాటు పాములు కూడా వస్తున్నాయి. అల్వార్ పరిధిలో ఓ ఇంట్లోకి పాము రావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసినా గంటల గంటలు గడిచినా జీహెచ్ఎంసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు.
దీంతో ఆ కుటుంబంలోని ఓ యువకుడు తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ, సదరు పామును పట్టుకుని జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసులోకి తెచ్చి వదిలిపెట్టాడు. ఆఫీసులోని టేబుల్‌పై పామును వదిలి నిరసన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.