శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (16:08 IST)

అగ్నిపథ్‌ మంటలు - సికింద్రాబాద్ మీదుగా వెళ్లే అన్ని రైళ్ళూ రద్దు

secunderbad railway station
దేశంలో సైనిక నియామకాలకు కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరుద్యోగులు దేశ వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఈ అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంలోనే ఆర్మీ ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇవి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ఇపుడు దక్షిణాదికి వ్యాపించాయి.
 
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు శుక్రవారం నిరసనలకు దిగారు. ఇవి అదుపుతప్పాయి. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు ఈస్ట్ కోస్ట్ రైలుకి నిప్పు పెట్టారు. అలాగే, స్టేషన్‌లోని 20 బైకులకు నిప్పుపెట్టారు. 
 
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులు.. మూడు రైళ్లు, 20 బైక్‌లకు నిప్పుపెట్టి రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేయడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది. మీడియా కథనాల మేరకు... పోలీసు కాల్పుల్లో ఒకరు మరణించారు.  దీంతో రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి అదుపు తప్పింది.
 
దక్షిణ మధ్య రైల్వే అధికారులు 44 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు అన్ని రైళ్లను రద్దు చేశారు. 300 రైళ్లను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్ వైపు వెళ్లే కొన్ని రైళ్లు వివిధ రైల్వే స్టేషన్లలో నిలిచిపోయాయి. సికింద్రాబాద్ వైపు వెళ్లే బస్సులను కూడా నిలిపివేసి దారి మళ్లించారు.