గిరిజన కోకిల మంగ్లీపై కుట్రపూరిత కేసు
గిరిజన కోకిల... సింగర్ మంగ్లీ పాట వివాదాస్పదంగా మారింది. ఆమెపై ఓ రాజకీయ పార్టీ నేతలు క్రిమినల్ కేసులు పెడుతున్నారు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని ఆమెపై అభియోగం మోపారు. మంగ్లీ పై కుట్రపూరిత కేసులు పెడితే సహించబోమని, గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్ ధ్వజమెత్తారు. హైదరాబాదులో మంగ్లీపై జరుగుతున్న కుట్రలను గిరిజన సంఘాల నేతలు ఖండించారు.
గిరిజన సింగర్ మంగ్లీపై కుట్ర పూరిత కేసులు బనాయించి, టీవీ ఛానల్ డిబేట్లలో అగౌరవంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్ మండిపడ్డారు. నంద్యాలలోని జి.పి.ఎస్, బంజారా ధర్మసేన కార్యాలయంలో రాయన మీడియాతో మాట్లాడుతూ, బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని సామాజిక మాధ్యమాల నుంచి పాటను తొలగించాలని కొందరు పెట్టిన కేసులను ఖండించారు. మంగ్లీపై కుట్రలు పన్నుతూ, ఆమె ఎదుగుదల చూడలేక గిరిజన మహిళను కించపరిచే విధంగా కొందరు డిబెట్లలో అగౌరవంగా మాట్లాడడం సరైంది కాదని మండిపడ్డారు.
హైదరాబాద్ లోని సింగర్ మంగ్లీపై రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. ఈ పాటను రాసింది ఒకరైతే, పాటను రిలీజ్ చేసింది ప్రొడ్యూసర్, అటువంటప్పుడు ఉన్నది ఉన్నట్లు పాటను పాడిన మంగ్లీపై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు.
మంగ్లీ పాడిన బోనాల పాటలో తప్పు ఏం లేదని సింగర్ పవన్ కుమార్, సంగీత దర్శకుడు బోలే సావలి తేల్చి చెప్పారని, కేవలం ఆమె ఎదుగుదలను ఓర్వలేక, కుట్ర పన్నుతూ ఆమె పాడిన పాటలను కించపరిచే విధంగా వ్యవహరించడం తగదని అన్నారు.
మంగ్లీపై చేస్తున్న వ్యాఖ్యలను, పెట్టిన పోలీసు కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని గిరిజన తండాల నుంచి జిల్లా,మండల కేంద్రాలలో వేలాది మందితో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బంజారా ధర్మ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాజా రామ్ నాయక్, జి.పి.ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, ప్రధాన కార్యదర్శి విజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.